లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ కన్నుమూత.. మేరునగధీరుడిని కోల్పోయామన్న మోదీ

కోల్‌కతా: లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత ఇబ్బందితో బాధపడుతున్నారు. ఈ నెల 8న గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను కోల్‌కతలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ హాస్పటల్‌లోనే 89 సంవత్సరాల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.

సీపీఎం పార్టీలో సుదర్ఘకాలంపాటు ఆయన కీలక నాయకులుగా పని చేశారు. 2004 నుంచి 2009 వరకు లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించారు. 1929 జులై 25న అస్సాంలో జన్మించారు. 1968 నుంచి 2008 వరకు సీపీఎం మెంబర్‌గా కొనసాగారు. 1971లో మొదటిసారిగా లోక్‌సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. తర్వాత తొమ్మిది సార్లు ఎంపీగా గెలిచారు. 1984లో ఒక్కసారి మాత్రం మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1996లో ఔట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు.

వామపక్ష వాది అయినా ఆయనకు భిన్న సిద్ధాంతాలు గల నేతలతో మంచి స్నేహ సంబంధాలు నెరిపారు. బీజేపీ అగ్రనేత అద్వానీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలతో సోమ్‌నాథ్ అత్యంత సన్నిహితంగా ఉండేవారు.

సోమ్‌నాథ్ ఛటర్జీ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. సోమనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారత రాజకీయాల్లో సోమ్‌నాథ్ మేరునగధీరుడని మోదీ కొనియాడారు. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సోమ్‌నాథ్ మరింత పటిష్టం చేశారని కీర్తించారు.

సోమ్‌నాథ్ ఛటర్జీ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా సంతాపం తెలిపారు. దేశానికి, మరీ ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ప్రజలకు తీరని లోటన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా సోమ్‌నాథ్ మృతిపై సంతాపం తెలిపారు. గొప్ప పార్లమెంటేరియన్‌ను కోల్పోయామని అమిత్ షా ట్వీట్ చేశారు.

ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా సోమ్‌నాథ్ మృతిపై సంతాపం తెలిపారు. ఆయన మరణం భారత రాజకీయాలకు తీరని లోటన్నారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*