రాహుల్‌తో సమావేశానికి హాజరైన నారా బ్రహ్మణి.. కాంగ్రెస్‌కు టీడీపీ సన్నిహితమౌతోందంటోన్న పరిశీలకులు

హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియా ఎడిటర్ల సమావేశంలో ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఇప్పట్లో అసాధ్యమని ఒప్పుకున్నారు. టీడీపీతో పొత్తు అవకాశాలపై రాహుల్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాల్లో పొత్తులకు సంబంధించి పీసీసీదే తుది నిర్ణయమన్నారు. జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకమని, గెలిచిన పార్టీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉండటం రాజ్యాంగబద్ధమని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్ణయం ఉండబోదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను విస్తరించడం తమ ముందున్న లక్ష్యమని చెప్పారు.

2019 ఎన్నికలపై రాహుల్ మాట్లాడుతూ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రధాని అయ్యే అవకాశమే లేదన్నారు. మోదీ ఊహల్లో బతుకుతున్నారని రాహుల్ చెప్పారు. బీజేపీకి 230 సీట్లు రాకుంటే మోదీ పీఎం కాలేరని, యూపీ, బీహార్‌లలో పొత్తుల వల్ల బీజేపీకి 230కి మించి సీట్లు రాబోవని రాహుల్ జోస్యం చెప్పారు.

తన వివాహంపై కూడా రాహుల్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే తన వివాహం జరిగిపోయిందన్నారు.

రాహుల్‌ ఏపీ, తెలంగాణకు చెందిన 245 మంది పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. వీరిలో నారా బ్రహ్మణి, నిర్మాత డి.సురేష్ బాబు తదితరులున్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ సంబంధాలు పటిష్టమౌతున్నాయని చెప్పేందుకు నారా బ్రహ్మణి రాహుల్‌తో సమావేశానికి హాజరు కావడమే ఉదాహరణ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

రాహుల్ చెప్పినట్లుగానే 2019లో మోదీ అధికారంలోకి రాకపోతే బీజేపీయేతర పార్టీలదే హవా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావడంతో టీడీపీ సన్నిహిత సంబంధాలు నెరిపితే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం టీడీపీ అధినేత చంద్రబాబుకు చిక్కుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీయేతర సీఎంలలో చంద్రబాబు అత్యంత చురుగ్గా ఉంటున్నారు. దీంతో భవిష్యత్తులో కేంద్ర రాజకీయాలను చంద్రబాబు శాసించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*