వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల.. కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు

న్యూఢిల్లీ :మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం మరింత క్షీణించింది. కొద్ది సేపటిక్రితం వాజ్ పేయి‌ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, ప్రాణాధార వ్యవస్థపైనే ఉన్నారని వైద్యులు తెలిపారు.

మరోవైపు ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అగ్రనేత ఎల్‌కే అద్వానీ, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, సుష్మాస్వరాజ్ పరామర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత, కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బస్ నఖ్వీ, జవదేకర్, విజయ్ గోయల్, జేపీ నడ్డా తదితరులు కూడా ఎయిమ్స్ వెళ్లి వాజ్‌పేయిని పరామర్శిస్తున్నారు. వైద్యులను అడిగి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.

అటు ఎయిమ్స్‌కు బీజేపీ నేతలు క్యూ కడుతున్నారు. వాజ్‌పేయి కోలుకోవాలంటూ పలుచోట్ల అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. వాజ్‌పేయి గురించి తలచుకుంటూ ఆయన కోడలు కాంతి మిశ్రా కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్వాలియర్ నుంచి వాజ్‌పేయి బంధువులు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో తన అభిమానులు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు రావద్దని కేజ్రీవాల్ సూచించారు.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటీవలే ఆయన ఢిల్లీ ఎయిమ్స్ వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*