ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణం.. పాక్‌లో సిద్ధూ ఓవర్ యాక్షన్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ 22వ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు హాజరయ్యారు. ఇస్లామాబాద్‌ ప్రెసిడెంట్ హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సిద్ధూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారత్ నుంచి ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి అధికారిక స్థాయిలో హాజరైన ఒకే ఒక్కడు సిద్ధు. ఇమ్రాన్ సిద్ధూకు మాత్రమే అధికారిక ఆహ్వానం పంపారు.

వాస్తవానికి ప్రధాని సహా పలువురిని పిలవాలనుకున్నా పాక్ విదేశాంగ శాఖ నుంచి క్లియరెన్స్‌లు రాకపోవడంతో తన ఆలోచనను విరమించుకున్నారు. అయితే సిద్ధూను మాత్రం తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని కోరారు. పాక్ జాతీయ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పీటీఐ అతి పెద్ద పార్టీగా అవతరించగానే సిద్ధూ ప్రశంసలు కురిపించారు. ఇమ్రాన్ వ్యక్తిత్వం గొప్పదని కీర్తించారు. దీంతో ఉబ్బితబ్బిబ్బైన ఇమ్రాన్ భారత్ నుంచి సిద్ధూను ఒక్కడినే పాకిస్థాన్‌కు ఆహ్వానించారు. ఆహ్వానం అందడమే తరువాయి క్షణాల్లో పాక్‌లో తేలిన సిద్ధూ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడు మసూద్ ఖాన్ పక్కనే కూర్చున్న సిద్ధూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ సందడి చేశారు. అయితే పాక్ ఆర్మీ ఛీఫ్‌ ఖమర్ జావేద్ బాజ్వాను సిద్ధూ ఆలింగనం చేసుకోవడంపై దుమారం రేగుతోంది.

ఉగ్రవాదానికి ఊతమీయడమే కాకుండా రోజూ సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతూ అమాయకులైన ప్రజలతో పాటు జవాన్ల ప్రాణాలు హరిస్తున్న పాక్ ఆర్మీపై భారత్ రగిలిపోతున్న తరుణంలో పాక్ ఆర్మీ ఛీఫ్‌ ఖమర్ జావేద్ బాజ్వాను సిద్ధూ ఆలింగనం చేసుకోవడం కలకలం రేపుతోంది. సిద్ధూ ఓవర్‌ యాక్షన్‌ను అంతా తప్పుబడుతున్నారు. సిద్ధూ కొత్త వివాదాలు కొని తెచ్చుకున్నాడంటూ నెటిజన్లు మండిపడ్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*