వరద బాధితులకు సాయం కోసం పెళ్లిని వాయిదా వేసుకున్న నటుడు

వరదలో కేరళ అతలాకులమైంది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. కేరళ ముఖ్యమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 370 మంది మృతి చెందగా పది లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రం తిరిగి కోలుకునేందుకు కనీస పదేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

కేరళకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ముందుకొచ్చారు. వస్తున్నారు కూడా. కాగా, వరద బాధితులకు సాయం చేయాలన్న తలంపుతో మలయాళ నటుడు రాజీవ్ గోవింద్ పిళ్లై ఏకంగా తన వివాహాన్నే వాయిదా వేసుకున్నాడు. నటి షకీలా జీవిత కథ ఆధారంగా హిందీ నిర్మిస్తున్న చిత్రంలో రాజీవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటి రిచా చద్దా ఈ సినిమాలో షకీలాగా నటిస్తోంది.

రాజీవ్‌ది కేరళలోని నన్నూరు. శనివారం అతడి వివాహం జరిగాల్సి ఉంది. అయితే, కేరళ వరద బాధితులకు సాయం చేయాలన్న తలంపుతో తన పెళ్లిని మూడు రోజులపాటు వాయిదా వేసుకున్నాడు. ఈ విషయాన్ని రిచా చద్దా ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘షకీలా’ సినిమాలో తన సహనటుడు రాజీవ్ కేరళ వరద బాధితులకు సాయం చేయాలన్న తలంపుతో పెళ్లిని వాయిదా వేసుకున్నట్టు తెలిపింది. మనకున్న బలం ఒక్కోసారి ఇతరులకు సాయం చేసేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంది.

 

మరోవైపు, గత రెండు రోజులుగా వానలు తగ్గుముఖం పట్టడంతో కేరళ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. బాధితులకు అవసరమైన నీళ్లు, ఆహారం అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా బాధితులను సుక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*