
అమరావతి: అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాలు, జాతీయ రాజకీయాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై చంద్రబాబు చర్చించారని సమాచారం. ప్రత్యేక హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని చంద్రబాబు నేతలతో చర్చించినట్లు సమాచారం. హోదా విషయంలో కాంగ్రెస్‌తో ఎలా వ్యవహరించాలో నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తుపై చర్చించారు. టీడీపీతో కాంగ్రెస్ నేతలు పొత్తుకు సిద్ధమని చెబుతున్న విషయంపై కూడా చర్చించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, పొత్తులపై చంద్రబాబుదే తుది నిర్ణయమని టీడీపీ నేతలు తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులుంటే బాగుంటుందని నేతలు చంద్రబాబుకు సూచించారు. కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం పెట్టినప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. గతంతో పోల్చుకుంటే ఏపీలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత తగ్గిందని నేతలు చంద్రబాబుతో చెప్పారు.
సమావేశానంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జాతీయ రాజకీయాలపై కూలంకషంగా చర్చించామని చెప్పారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో ఎలా వ్యవహరించాలనేది నిర్ణయిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.
Be the first to comment