
హైదరాబాద్: తెలంగాణ మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులంతా బుధవారం సాయంత్రం 4 గంటలకల్లా హైదరాబాద్‌కు రావాలని ప్రగతిభవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై వాతావరణం వేడెక్కుతోంది. బుధవారం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం.
ఏపీలోనూ, తెలంగాణలోనూ కాంగ్రెస్‌తో పొత్తులపై టీడీపీ సంకేతాలిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరితోనూ పొత్తులుండవని కేసీఆర్ ఇటీవలే తేల్చి చెప్పారు. రాహుల్ ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ పొత్తులుండవని కుండబద్దలు కొట్టారు. ముందస్తు, వెనకస్తు ఉండబోవన్నారు. అయితే కేసీఆర్ ముందస్తుకే సై అంటున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో నెగ్గడం కేసీఆర్‌కు ప్రతిష్ఠగా మారింది. ఈ తరుణంలో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ కొనసాగుతుండటాన్ని అవకాశంగా మలచుకోవాలని కేసీఆర్ తలపోస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సెంచరీపైనే స్థానాలు సాధిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తుండటానికి కారణం ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగిస్తున్న అనేక రకాల పథకాలకు అనూహ్య స్పందన వస్తుండటంతో భవిష్యత్తులో ఇవి కొనసాగాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఎన్నిక కావాల్సిందేనని కేసీఆర్ పిలుపు ఇవ్వనున్నారు.
Be the first to comment