వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వదర ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం విహంగవీక్షణం చేసిన ముఖ్యమంత్రి జరిగిన నష్టంపై అంచనా వేశారు. అనంతరం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

రాష్ట్రంలో 2006తో ఇవే పెద్ద వరదలని పేర్కొన్నారు. పునరావాస చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.600 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన పరిహారం చెల్లించనున్నట్టు చెప్పారు. హెక్టార్‌కు రూ.25 వేలు నష్టపరిహారంగా అందిస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 19 మండలాల్లోని 45 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని పేర్కొన్న చంద్రబాబు.. కాజ్‌వేల పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయించనున్నట్టు చెప్పారు. నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ కేంద్రం నుంచి పోలవరానికి ఇంకా రూ.2,600 కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు పనులు 57.5 శాతం పూర్తయ్యాయన్నారు. వచ్చే ఏడాది మే నాటికి మొత్తం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం తీసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*