రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. పెట్రోలు, డీజిల్‌పై జీఎస్టీ లేనట్టే!

పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న కేంద్రం ప్రయత్నాలను అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది శుభవార్తే. పెట్రోలు, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఆర్థికంగా భారీగా నష్టపోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గింది. సమీప భవిష్యత్తులో పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ‘ఒకే దేశం.. ఒకే పన్ను’ లక్ష్యంతో జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ సమయలో ఐదు పెట్రో ఉత్పత్తులైన పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)లను జీఎస్టీ నుంచి పక్కన పెట్టింది.

చమురు మంత్రిత్వ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ఇండస్ట్రీ వర్గాలతో సమావేశమై పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. ధరల్లో అస్థిరతను నివారించాలంటే వీటిని జీఎస్టీకి పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుందని వివరించారు. అయితే, వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఆదాయ పరంగా భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి.

ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్రాలన్నీ పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో స్పందించిన కేంద్రం ఈ ఆలోచన నుంచి వెనక్కి తగ్గింది. దీంతో సమీప భవిష్యత్తులో ఇవి జీఎస్టీ పరిధిలోకి వచ్చే అవకాశం లేనట్టే.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయమై మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్, సహజ వాయువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*