మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్న కోహ్లీ

లండన్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై 203 పరుగుల భారీ విజయం సాధించడంతో ఇది సాధ్యమైంది. మొత్తం 937 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌టైమ్ రేటింగ్ పాయింట్స్ టాప్ టెన్‌ జాబితాలో చోటు సంపాదించడానికి కేవలం ఒక పాయింట్ దూరంలో ఉన్నాడు.

ఆల్‌టైమ్ రేటింగ్ పాయింట్స్ టాప్ టెన్‌ లిస్ట్‌లో 961 పాయింట్లతో డాన్ బ్రాడ్‌మన్‌ తొలి స్థానంలో‌ ఉన్నారు. స్టీవ్ స్మిత్ 947 పాయింట్లు, లెన్ హుటన్ 945 పాయింట్లు, జాక్ హోబ్స్, రికీ పాంటింగ్ 942 పాయింట్లు, పీటర్ మే 941 పాయింట్లు, గేరీ సోబర్స్, క్లైట్ వాల్‌కోట్, వివియన్ రిచర్డ్స్, కుమార సంగక్కర్ 938 పాయింట్లతో టాప్‌టెన్ జాబితాలో ఉన్నారు.

ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్‌లో హార్దిక్ పాంగ్యా 28 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ రాణించాడు. దీంతో బ్యాట్స్‌మన్ల జాబితాలో ఎనిమిది పాయింట్లు జంప్ చేసి 51వ స్థానానికి చేరుకున్నాడు. తన కెరీర్‌లోనే హైఎస్ట్‌గా 340 పాయింట్లు సంపాదించాడు. తన ఆల్‌రౌండ్ ప్రతిభ కారణంగా పాండ్యా 27 స్థానాలు జంప్ చేసి 17వ స్థానంలోకి చేరుకున్నాడు.

బుమ్రా కూడా మూడో టెస్ట్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. 85 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో రూట్, జానీ బెయిర్ స్టో, బట్లర్‌ల వికెట్లు తీశాడు. ఈ కారణంగా బుమ్రా టెస్టుల్లో 37వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

బ్యాట్స్‌మెన్ల జాబితాలో శిఖర్ ధావన్ 22, అజింక్యా రహానే 19వ స్థానంలో నిలిచారు.

అంతకు ముందు ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌ బిడ్జ్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. తొలి రెండు టెస్టుల్లోనూ ఘోరంగా ఓటమి పాలై విమర్శలు మూటగట్టుకున్న కోహ్లీ సేన మూడో టెస్టులో సత్తా చాటింది. కోహ్లీ అద్భుత సెంచరీకి తోడు హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రాలు బంతితో మ్యాజిక్ చేయడంతో విజయం భారత్ సొంతమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (97) తృటిలో సెంచరీ చేజార్చు కోగా, అజింక్యా రహానే 81 పరుగులు చేయడంతో భారత్ 300 పరుగుల మార్కు దాటింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను భారత పేసర్లు దారుణంగా దెబ్బతీశారు. 161 పరుగులకే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేశారు. ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేసిన 39 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్‌తో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 352/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శిఖర్ ధవన్ 44, లోకేశ్ రాహుల్ 36, చతేశ్వర్ పుజారా 72 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ మరోమారు రెచ్చిపోయాడు. ఈసారి మాత్రం సెంచరీ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. 103 పరుగులు చేసి కెరీర్‌లో 23వ శతకాన్ని నమోదు చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీకి ఇది రెండో టెస్టు సెంచరీ. భారత్ విధించిన 521 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్ 317 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 203 పరుగుల భారత్ ఆధిక్యంతో భారత్ విజయం సాధించింది. ఫలితంగా 5 టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ సెంచరీ (106)తో ఆదుకున్నప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. ఒకానొక దశలో ఇంగ్లండ్ ఇన్నింగ్ నాలుగో రోజే ముగుస్తుందని భావించినా బట్లర్ అడ్డుగోడలా నిలిచాడు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. చివరికి ఓవర్ నైట్ స్కోరు 311/9కి మరో ఆరు పరుగులు జోడించి చివరి వికెట్‌ను చేజార్చుకుంది.

రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇషాంత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. అద్భుత సెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించి పెట్టిన కెప్టెన్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*