కొత్త పార్టీని ప్రకటించిన కొత్తపల్లి గీత.. చంద్రబాబు, జగన్‌పై నిప్పులు

ఆంధప్రదేశ్ రాజకీయ యవనికపైకి మరో కొత్త పార్టీ వచ్చేసింది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత కొద్దిసేపటి క్రితం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కొత్త పార్టీ పేరును ప్రకటించి, జెండాను ఆవిష్కరించారు. పార్టీ పేరును ‘జన జాగృతి’గా పేర్కొన్న గీత తెలుపు, నీలం రంగుల్లో మధ్యలో గొడుగు గుర్తుతో ఉన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘మార్పు కోసం ముందడుగు’ నినాదంతోనే పార్టీని స్థాపించినట్టు పేర్కొన్నారు.

గతంలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ప్రజా సమస్యలను చాలా దగ్గరగా చూశానని పేర్కొన్నారు. డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన నాలుగున్నరేళ్లూ ప్రజలతో మమేకమైనట్టు చెప్పారు. ఆ అనుభవంతోనే ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే పార్టీని స్థాపించినట్టు వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యోగ, ఉపాధి విషయంలో చంద్రబాబు యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన కుమారుడికి మాత్రం ఉద్యోగం (మంత్రి పదవి) ఇచ్చుకున్నారని ధ్వజమెత్తారు.

వైసీపీ చీఫ్ జగన్ అసలు అసెంబ్లీకే రారని, ఆయనకు ప్రజా సమస్యలు అక్కర్లేదని, సీఎం పదవి మాత్రం కావాలని తీవ్రస్థాయిలో ఆరోపించారు. తన జనజాగృతి పార్టీలో మహిళలు, యువతకు పెద్ద పీట వేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తానన్నారు. స్థానిక సమస్యల ఆధారంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మేనిఫెస్టో రూపొందించనున్నట్టు గీత స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*