‘సీఎం నా బావమరిది.. నాకే జరిమానా విధిస్తారా?.. మీ సంగతి తేలుస్తా’

మధ్యప్రదేశ్ అసెంబ్లీ వద్ద ఘటన, తనకు చాలామంది బావలు ఉన్నారన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

‘‘అసలేం అనుకుంటున్నారు నా గురించి.  సీఎం  నా బావ.. మీ సంగతి తేలుస్తా?’’ అంటూ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ముందు పోలీసులపై వీరంగమేశాడో వ్యక్తి. కారులో ఉన్న మహిళలు అతడికి వంతపాడారు. అంతే.. ఒక్కసారిగా అక్కడ గందరగోళం ఏర్పడింది. నిబంధనలకు విరుద్ధంగా కారుకు సైరన్ పెట్టుకుని వెళ్తున్న అతడిని ఆపడమే పోలీసుల పాపమైంది. కారును ఆపడంతో ఆగ్రహంతో ఊగిపోతూ కారు దిగిన అతడు పోలీసులపై రెచ్చిపోయాడు. ‘‘ఎవరనుకుంటున్నారు నన్ను. సీఎం నా బావమరిది. నన్నే ఆపుతారా? నాకే జరిమానా విధిస్తారా?’’ అంటూ ఫైరయ్యాడు. అంతేకాదు, ‘‘ఇది సీఎం ఫోన్ నంబరు, ఫోన్ చేస్తున్నా. మీ సంగతి తేలుస్తా’’ అంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు. కారులో ఉన్న మహిళలు అతడికి వంతపాడారు. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

మధ్యప్రదేశ్‌లో ఇటీవల కొందరు నిబంధనలను అతిక్రమించి వాహనాలకు సైరన్ పెట్టుకుంటున్నారు. దీంతో ఇటువంటి వారిపై ఉక్కుపాదం నిర్వహించాలని పోలీసు శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి సైరన్ పెట్టుకున్న వారిపై జరిమానాలు విధిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం బావగా చెప్పుకుంటున్న వ్యక్తి పోలీసులకు చిక్కాడు. పోలీసులతో అతడు వాగ్వాదానికి దిగి వీరంగమేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సీఎం బంధువునంటూ వీరంగమేసిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. కారు మాత్రం రాజేంద్ర సింగ్ చౌహానే అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్పందించారు. రాష్ట్రంలో తనకు చాలామంది అక్కాచెల్లెళ్లు ఉన్నారని, దీంతో బావల సంఖ్య కూడా ఎక్కువేనని చమత్కరించారు. అయితే, నిబంధనలు అతిక్రమిస్తే బావ అయినా, ఇంకెవరైనా శిక్ష మాత్రం తప్పదని హెచ్చరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*