కేరళ రిలీఫ్ క్యాంపులో కూలీలా పనిచేస్తున్న భారత ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు

ప్రకృతి విలయంతో అతలాకుతలమైన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరదలతో చిగురుటాకులా వణికిన కేరళను ఆదుకునేందుకు దేశం మొత్తం కదిలొచ్చింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, సినీ తారలు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థలు తమకు తోచినంత సాయం ప్రకటించి తామున్నామంటూ బాధితులకు అండగా నిలిచాయి. వందలాదిమంది స్వచ్ఛందగా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. అయితే, భారత ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు, కేరళ బ్లాస్టర్స్ స్టార్ సీకే వినీత్ మాత్రం కోట్లాదిమంది ప్రజల హృదయాలు గెలుచుకున్నాడు. కేరళ వరద బాధితులకు ‘హీరో’గా మారాడు.

ఓ రిలీఫ్ క్యాంపులో అతడు పనిచేస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొచ్చి రీజనల్ స్పోర్ట్స్ సెంటర్‌లో అతడు పనిచేస్తుండగా తీసిన ఫొటోలు అవి. తాను స్టార్ ఆటగాడినన్న విషయాన్ని మర్చిపోయి ఓ కూలీలా అతడు పనిచేస్తుండడం అందరి హృదయాలను కొల్లగొట్టింది. క్యాంపునకు వచ్చిన సహాయ సామగ్రి, ఆహారం, ఇతర వస్తువులను అన్‌లోడింగ్ చేస్తూ అచ్చం పోర్టర్‌లా ఉన్నాడు.

ఫుట్‌బాల్ స్టార్‌గా ఎదిగిన వైనం అతడిని ఎదిగి ఉన్నా ఒదిగి ఉండేలా చేసింది. గతంలోనూ వినీత్ తన ప్రవర్తనతో మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. సోషల్ మీడియాలో వినీత్ ఫొటోలు చూస్తున్న వారు అతడి మంచి మనసుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అభిమానులు అతడిని ‘డార్లింగ్ ఆఫ్ మిలియన్’ అంటూ కీర్తిస్తున్నారు. ప్రస్తుతం కేరళకు వినీత్ లాంటి వారి అవసరం చాలా ఉందని మరికొందరు కామెంట్ చేశారు. బాధితుల బాధలను పంచుకుని స్వయంగా సహాయ కార్యక్రమాల్లో చెమటోడుస్తున్న వినీత్ ధన్యుడని మరికొందరు వ్యాఖ్యానించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*