ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం: బెర్లిన్‌లో ప్రకటించిన రాహుల్.. ఆసక్తికరంగా మారుతున్న రాజకీయాలు 

బెర్లిన్: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెర్లిన్‌లో ప్రకటించారు. రాహుల్ ప్రస్తుతం జర్మనీలో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఏపీకి చెందిన ఓ యువకుడు ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన రాహుల్ ఏపీకి ప్రత్యేక హోదా పార్లమెంట్ ఇచ్చిన హక్కని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

నిజానికి తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. నాలుగేళ్ల క్రితం యూపీయే పదేళ్ల పాలన పూర్తౌతున్న వేళ చివరి పార్లమెంట్ సమావేశాల్లో చివరి రోజు తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించేలా చేసింది కాంగ్రెస్ పార్టీయే. పార్లమెంట్‌లో ఈ బిల్లు వచ్చినప్పుడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చాయి.

ఇంతవరకూ బాగానే ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్థి నిధుల గురించి, అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించి చిక్కుముడులు ఏర్పడ్డాయి. ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోమని ఎన్డీయే ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఏపీ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. ప్రత్యేక హోదా పరిస్థితి అలా ఉంటే టీడీపీకి, బీజేపీకి మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో టీడీపీ విభేదించి బయటకు వచ్చింది. వైసీపీ బూచితోటే టీడీపీ ఎన్డీయే నుంచి వైదొలిగిందని బీజేపీ చెబుతోంది. ప్రత్యేక హోదాపై వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పోరు ఉధృతం చేయడంతో టీడీపీ కూడా గేర్ మార్చింది. నాలుగేళ్లు ఎన్డీయేలో కొనసాగాక బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పటి నుంచీ బీజేపీకి చెక్ పెట్టడానికి చంద్రబాబు విపరీతంగా యత్నిస్తున్నారు.

ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేశారు. బీజేపీకి అధికారం దక్కకుండా చేశారు. రాబోయే రోజుల్లో మోదీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్‌తో దోస్తీకి సై అంటున్నారు. కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకార సభలో చంద్రబాబు సోనియా, రాహుల్‌తో వేదికను పంచుకున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి యత్నాలు ముమ్మరం చేశారు. చంద్రబాబు ప్రస్తుతానికి సింగిల్ పాయింట్ ఎజెండాతో వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. 2019లో నరేంద్ర మోదీని తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయన అన్ని పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందుకే ఆయన తెలుగు రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన కాంగ్రెస్‌తో దోస్తీకి సై అంటున్నారు.

చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడం తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా నచ్చడం లేదు. కాంగ్రెస్ దరిద్రం తమకు వద్దని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా నాడు ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారో నేడు అదే పార్టీతో చంద్రబాబు అంటకాగుతున్నారని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆరోపిస్తున్నారు.

2019 ఎన్నికల నాటికి ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయాలు మరింత రసవత్తరంగా మారతాయని పరిశీలకులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*