డ్రోన్ల నియంత్ర‌ణ‌పై విధానం రూపొందించండి: చంద్ర‌బాబు

అమరావతి: డ్రోన్ల నియంత్ర‌ణ‌పై ఒక స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ స్టేట్ క‌మాండ్ కేంద్రంలో ఆయ‌న శుక్ర‌వారం ఈ-ప్ర‌గ‌తి, ఆర్టీజీఎస్‌ల ప‌నితీరుపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా డ్రోన్ కార్పొరేష‌న్ ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు. డ్రోన్ కార్పొరేష‌న్ చాలాముఖ్య‌మైంద‌ని, దాని ప‌నితీరు ప‌టిష్టంగా ఉండాల‌ని, అనుకున్న ల‌క్ష్యాల మేర‌కు ప‌నులు సాగాల‌ని తెలిపారు.

దేశంలో డ్రోన్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేయ‌డానికి ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మాత్ర‌మే అనుమ‌తి వ‌చ్చింద‌ని, ఈ ప్రాజెక్టుకు చాలా ప్రాముఖ్య‌త ఉందని చంద్రబాబు తెలిపారు. డ్రోన్ ఎవ‌రంటే వారు ఎగ‌రేసి వివిద ర‌కాల ప‌నుల‌కు ఉప‌యోగిస్తున్నార‌ని, అయితే భ‌ద్ర‌త దృష్టా కూడా కొన్ని సమ‌స్య‌లున్నాయి కాబ‌ట్టి రాష్ట్రంలో డ్రోన్ల వినియోగంపై కార్పొరేష‌న్ ఒక స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని సూచించారు. డ్రోన్ల నియంత్ర‌ణ‌పై ఈ విధానం ప‌టిష్టంగా ప‌నిచేయాల‌న్నారు. ఎవ‌రైనా స‌రే డ్రోన్ ఉప‌యోగించాలంటే ముందుగా కార్పొరేష‌న్ నుంచి అనుమ‌తి తీసుకునేలా ఈ విధానం ఉండేలా చూడాల‌న్నారు. ఏపీ ట‌వ‌ర్స్ ప‌నితీరును కూడా ముఖ్య‌మంత్రి స‌మీక్షించారు. ఈ ప్రాజెక్టు ప‌నులు కూడా వేగంగా నిర్వ‌హించాల‌న్నారు. వ‌ర్చువ‌ల్ త‌ర‌గతుల ఏర్పాటు కూడా యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని తెలిపారు. కంటెంట్ కార్పొరేష‌న్ చురుగ్గా ప‌నిచేయాల‌ని, కంటెంట్ కార్పొరేష‌న్ కంటెంట్‌కు సంబంధించి ఒక పూర్తి స్థాయి నిధిలాగా ప‌నిచేయాల‌ని సూచించారు. స‌ర్వైలెన్స్ కెమెరాల ఏర్పాటులో మ‌రింత వేగం పెగాల‌ని సూచించారు.

ఏపీ ఫైబ‌ర్ నెట్ ప్ర‌గ‌తిపైనా సీఎం చంద్రబాబు స‌మీక్షించారు. ప్ర‌స్తుతం 4.35 ల‌క్ష‌ల క‌నెక్ష‌న్లు ఇచ్చామ‌ని అధికారులు తెలిపారు. అనుక‌న్న ల‌క్ష్యాల మేర‌కు క‌నెక్ష‌న్ల సంఖ్య పెర‌గాల‌ని, అందుకు త‌గ్గ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. ఈ-ప్ర‌గ‌తి ప‌నులు కూడా వేగం పెరగాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. డాటా అనేది చాలా కీల‌క‌మైంద‌ని, డాటా మ‌న వ‌ద్ద ఉన్న‌ప్ప‌డు వాటిని విశ్లేషించ సమ‌ర్థంగా వినియోగించుకోవ‌డానికి ఆయా ప్ర‌భుత్వ శాఖ‌లు విష‌య నిపుణుల‌ను కూడా ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. ఉదాహ‌ర‌ణ‌కు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ వ్యాధులు ఎక్కువ‌గా ఉన్నాయో డాటా మ‌న వ‌ద్ద ఉన్న‌ప్పుడు దాని ఆధారంగా అక్క‌డ ఆ వ్యాధులు ప్ర‌బ‌ల‌డానికి కార‌ణాలేంటీ, నివార‌ణ‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల అనే అంశంపై ప‌రిశోధ‌న‌లు చేయడంతో పాటు స‌రికొత్త ఆవిష్క‌ర‌ణు చేయ‌డానికి కూడా వీలవుతుంద‌న్నారు. సేక‌రించిన డాటా ఆధారంగా క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితి ఎలా ఉంద‌నేది ఆయా విభాగాల్లో ప‌రిశీలన జ‌రిగి ఒక వాస్త‌వ నివేదిక ఉండాల‌ని, దాని ఆధారంగా ప‌నిచేయాల‌న్నారు. ప్ర‌తి విభాగాల్లోనూ ఈ త‌ర‌హా క‌స‌ర‌త్తు జ‌ర‌గాల‌ని సూచించారు.

ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కార్యాల‌య ప్రత్యేక ప్రధాన కార్య‌ద‌ర్శి స‌తీష్ చంద‌ర్‌, కార్యదర్సులు రాజ‌మౌళి, గిరిజా శంక‌ర్‌, ఐటీ కార్య‌ద‌ర్శి విజ‌యానంద్‌, ఆర్టీజీఎస్ సీఈఓ బాబు ఏ, ఈ-ప్ర‌గ‌తి సీఈఓ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, ముఖ్య‌మంత్రి ఓ ఎస్‌డీ బాలాజీ ఆదివిష్ణు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*