కేరళకు భారీ ఆర్థిక సాయం ప్రకటించిన యాపిల్

అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కేరళకు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. వరదల గురించి తెలిసి దిగ్భ్రాంతి చెందిన ఆ సంస్థ ఏకంగా ఏడు కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు, ప్రకృతి బీభత్సంతో అల్లాడిన ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా తమ యూజర్లను కోరింది. ఇందుకోసం యాప్ స్టోర్, ఐట్యూన్స్‌లలో డొనేట్ బటన్ ఏర్పాటు చేసింది. దీనిని ఉపయోగించి క్రెడిట్, డెబిట్ కార్డులతో విరాళం ఇవ్వొచ్చని తెలిపింది. తమవంతు సాయంగా కేరళ సీఎం సహాయనిధి, మెర్సీ కార్ప్స్ ఇండియాకు విరాళం అందిస్తున్నట్టు వివరించింది.

జల విలయానికి అల్లాడిపోయిన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పునరావాస శిబిరాల నుంచి బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ విలయంలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. కేరళ బాధితులను ఆదుకునేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖ కంపెనీలు ముందుకు రాగా, విదేశాలు, అక్కడ నివసిస్తున్న భారతీయులు సైతం విరాళాలు ప్రకటించి చేయూత అందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*