బ్యూటీషియన్ పద్మ ప్రియుడు నూతన్ ఆత్మహత్య

విజయవాడ: కృష్ణా జిల్లా బాపులపాడులో బ్యూటీషియన్ పద్మపై దాడి చేసిన ఆమె ప్రియుడు నూతన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. మరోవైపు పద్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసులో సుబ్బయ్య అనే మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు. పద్మ నుదిటిపై ఎస్ అనే అక్షరం మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

కలహాల కాపురంలో కలిసుండలేక.. కన్న బిడ్డతో కలిసి వేరుగా ఒంటరిగా ఉంటున్న పద్మపై నాలుగేళ్ల క్రితం నూతన్ కన్ను పడింది. కలకాలం కలిసుందామంటూ వెంటపడ్డాడు. అతని మాటలు నమ్మి.. అంగీకరించింది. సహజీవనం చేస్తోన్న నూతన్ కుమార్ ఆమె పాలిట కాలయముడిగా మారాడంటున్నారు స్థానికులు.

ఈనెల 23వ తేదీ రాత్రి పద్మ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమెపై కత్తితో అమానుషంగా దాడి చేశారు. కాళ్లూ చేతులు నరికారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అరుపులు బయటకు వినపడకుండా పద్మ నోట్లో గుడ్డలు కుక్కారని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ పద్మను.. స్థానికులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులకు సమాచారం అందించారు. కొంతకాలంగా పద్మపైనే ఆధారపడి జీవిస్తున్న నూతన్‌కుమార్‌.. పద్మను వదిలించుకునేందుకు ప్లాన్‌ ప్రకారమే ఇలా చేశాడని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పద్మ భర్తపేరు సూర్యనారాయణ కావడంతో అతడిపైకి నేరాన్ని నెట్టేందుకే ఎస్ అనే అక్షరాన్ని చెక్కారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి‌ చేరుకొని వేలి ముద్రలు సేకరించారు. భర్త సూర్యనారాయణతో పాటు.. ఆమె కుమార్తెను ప్రశ్నించారు. వాళ్లు కూడా పద్మతో చనువుగా ఉంటున్న నూతన్ కుమారే ఈ దారుణం చేసి ఉంటాడని సందేహాలు వ్యక్తం చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులోనూ నూతన్‌కుమారే హంతకుడై ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. దాడి తర్వాత నుంచి నూతన్‌కుమార్‌ అదృశ్యం అయ్యాడు. నూతన్ కోసం పోలీసులు తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టడంతో మరో మార్గం లేక నూతన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*