బ్యూటీషియన్ పద్మ పరిస్థితి విషమం.. వీడని ఎస్ అక్షరం మిస్టరీ

విజయవాడ: కృష్ణా జిల్లా బాపులపాడులో దాడికి గురైన బ్యూటీషియన్ పద్మ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఆమెపై హత్యాయత్నం చేశాడని భావిస్తున్న ప్రియుడు నూతన్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు జరుపుతున్నారు. అటు పద్మ నుదిటిపైన ఉన్న ఎస్ అనే అక్షరం మిస్టరీని తేల్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

కలహాల కాపురంలో కలిసుండలేక.. కన్న బిడ్డతో కలిసి వేరుగా ఒంటరిగా ఉంటున్న పద్మపై నాలుగేళ్ల క్రితం నూతన్ కన్ను పడింది. కలకాలం కలిసుందామంటూ వెంటపడ్డాడు. అతని మాటలు నమ్మి.. అంగీకరించింది.

ప్రస్తుతం పద్మ చావుబతుకుల మధ్య విజయవాడ ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. సహజీవనం చేస్తోన్న నూతన్ కుమార్ ఆమె పాలిట కాలయముడిగా మారాడంటున్నారు స్థానికులు. పద్మ నుదిటిపైన ఉన్న ‘ఎస్‌’ అక్షరం వెనకున్న మిస్టరీని చేధించడానికి కృష్ణా జిల్లా పోలీసులు యత్నిస్తున్నారు.

ఈనెల 23వ తేదీ రాత్రి పద్మ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమెపై కత్తితో అమానుషంగా దాడి చేశారు. కాళ్లూ చేతులు నరికారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అరుపులు బయటకు వినపడకుండా పద్మ నోట్లో గుడ్డలు కుక్కారని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ పద్మను.. స్థానికులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులకు సమాచారం అందించారు. కొంతకాలంగా పద్మపైనే ఆధారపడి జీవిస్తున్న నూతన్‌కుమార్‌.. పద్మను వదిలించుకునేందుకు ప్లాన్‌ ప్రకారమే ఇలా చేశాడని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పద్మ భర్తపేరు సూర్యనారాయణ కావడంతో అతడిపైకి నేరాన్ని నెట్టేందుకే ఎస్ అనే అక్షరాన్ని చెక్కారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి‌ చేరుకొని వేలి ముద్రలు సేకరించారు. భర్త సూర్యనారాయణతో పాటు.. ఆమె కుమార్తెను ప్రశ్నించారు. వాళ్లు కూడా పద్మతో చనువుగా ఉంటున్న నూతన్ కుమారే ఈ దారుణం చేసి ఉంటాడని సందేహాలు వ్యక్తం చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులోనూ నూతన్‌కుమారే హంతకుడై ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. దాడి తర్వాత నుంచి నూతన్‌కుమార్‌ అదృశ్యం అయ్యాడు. ఘటన జరిగిన తీరును పరిశీలిస్తే క్షణికావేశంలో జరిగింది కాదని పోలీసులు అంటున్నారు. ముందస్తు ప్రణాళికతోటే ఆమెకు ఏదైనా డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి, అరవకుండా టవల్‌ను నోట్లో కుక్కి, కాళ్లు, చేతులు కట్టేసి.. హింసించారని చెబుతున్నారు. అయితే.. ఈ ఘటనలో మిస్టరీ వీడాలంటే.. అపస్మారక స్థితిలో ఉన్న పద్మ కోలుకోవాలని, లేదంటే నూతన్‌కుమార్‌ దొరకాలని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ‌అరవకుండా‌ నోట్లో టవల్ కుక్కడం వల్ల ఆమెకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందని, ఆమె కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని తెలిపారు.

అటు సహజీవనం పేరుతో దగ్గరై ఆర్థికంగానూ పద్మపైనే ఆధారపడటం వల్ల ఇద్దరి మధ్యా వివాదం తలెత్తి ఉండవచ్చునని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. నూతన్‌కుమార్‌ పట్టుబడితేనే పద్మపై దాడి చేసిందెవరనే విషయం బయటపడే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*