నారా హమారా.. టీడీపీ హమారాలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గుంటూరు: రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎన్డీఏ ప్రభుత్వమేనని నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం విధానం సరైంది కాదన్నారు.  ట్రిపుల్ తలాక్‌పై కేంద్రాన్ని నిలదీసింది టీడీపీయేనని స్పష్టం చేశారు.  రేపటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఒక్క ఓటు కూడా ఇతర పార్టీలకు వేయబోరని చంద్రబాబు చెప్పారు. ముస్లిం మైనార్టీల ఓట్లన్నీ టీడీపీకే వస్తాయన్నారు. పవిత్ర ఆశయాల కోసం ఏర్పాటు చేసుకున్న ఈ సభను చూసి చాల మంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చంద్రబాబు చెప్పారు.

 

తన రాజకీయ జీవితంలో ఇంత పెద్ద మైనార్టీ సమావేశాన్ని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు చెప్పారు. అన్యాయం చేసిన బీజేపీని, ముస్లిం సోదరులను దగా చేస్తున్న ఎన్డీయేను గద్దె దింపడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీకి వినపడేలా నినదించాలని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన పోరుగడ్డ ఇదని గుర్తు చేశారు. పెదనందిపాడులో పర్వతనేని వీరయ్య చౌదరి, పల్నాడులో కన్నెగంటి హనుమంతు పోరాడారని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిలో ముస్లింలు ముందున్నారని చెప్పారు. ఈ ప్రాంతంలో జరిగిన పుల్లరి సత్యాగ్రహంలో నదీం సాహెబ్, జాన్ అహ్మద్ సహా చాలా మంది ముస్లింలు కీలక భూమిక పోషించారని చంద్రబాబు తెలిపారు. గుంటూరుకు, ఎన్టీఆర్‌కు అవినాభావ సంబంధం ఉందని, ఎన్టీఆర్ సన్నిహితుడు పఠాన్ ఉమ్రాన్ ఖాన్ ను 83లోనే ఎమ్మెల్యేగా చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. లాల్ జాన్ బాషా లేకపోయినా ఆయన స్ఫూర్తి అందరిలో ఉందన్నారు. ముస్లింలందరూ టీడీపీతోనే ఉంటామని ముక్తకంఠంతో చెప్పాలని చంద్రబాబు కోరారు.

అవినీతి వైసీపీ, కుట్రలు పన్నే పవన్ కల్యాణ్‌లను ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు- పవన్, జగన్ బీజేపీతోనే ఉండి నాటకాలాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కాంగ్రెస్ అన్యాయం చేస్తే బీజేపీ న్యాయం చేస్తుందనే ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకున్నామని, నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా మోసం చేశారని చంద్రబాబు వాపోయారు. పవన్ కల్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి 75 వేల కోట్ల అన్యాయం జరిగిందని, అవిశ్వాసం పెడితే ఢిల్లీ వెళ్లి ఎంపీలను సమీకృతం చేస్తానని చెప్పి అడ్రస్ లేకుండా పోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కేసుల కోసం బీజేపీతో లాలూచీ పడి రాష్ట్రాన్ని జగన్ మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పవన్, జగన్ తనపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. హోదా ఇవ్వాల్సింది, మోసం చేసింది ఎన్డీయే ప్రభుత్వమని చంద్రబాబు చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడి, మత విద్వేషాలు రగలకుండా చూసిన పార్టీ టీడీపీ అని, మైనార్టీ సోదరులెవ్వరికీ అన్యాయం జరగకుండా అండగా ఉంటానని చంద్రబాబు చెప్పారు.  రాష్ట్రంలో ఎవరైనా తోక తిప్పి మైనార్టీల జోలికి వస్తే వదిలిపెట్టబోమని హెచ్చరించారు.  జనం ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలో కేంద్రానికెందుకని చంద్రబాబు ప్రశ్నించారు. దేశంలోని అనేక కులాలు, మతాల స్వేచ్ఛకు సహకరించాలి కాని మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించకూడదన్నారు. మైనార్టీ సోదరులు ట్రిపుల్ తలాక్ చెప్పిన తర్వాత కూడా విచారణ జరిపి జైలుకు పంపిస్తానంటే అన్యాయం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*