మళ్లీ నిరాశపరిచిన పతంజలి.. ‘కింభో’ లాంచింగ్ వాయిదా

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా పతంజలి తీసుకొచ్చిన దేశీయ మెసేజింగ్ యాప్ ‘కింభో’ అందుబాటులోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టేలా కనిపిస్తోంది. సరికొత్త హంగులతో సోమవారం అందుబాటులోకి రావాల్సిన ఈ యాప్ విడుదల మరోమారు వాయిదా పడింది. సోమవారమే యాప్ అందుబాటులోకి రావాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్టు పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. యాప్‌ను ఎప్పుడు విడుదల చేసేది తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

వాట్సాప్‌కు పోటీగా తీసుకొచ్చిన ఈ యాప్‌లో భద్రతాపరమైన లోపాలున్నాయన్న ఆరోపణలతో గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి దీనిని వెనక్కి తీసుకున్నారు. దీనిని పూర్తిస్థాయిలో నవీకరించి ఈనెల 15న తిరిగి ప్లే స్టోర్‌లో ఉంచారు. భద్రత పరంగా పూర్తి కట్టుదిట్టంగా యాప్‌ను రూపొందించినట్టు చెప్పిన ఆచార్య బాలకృష్ణ ఈ నెల 27న యాప్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు.

యాప్‌ను ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్‌లో ఉంచామని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే, దీనిని డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లు అందులో సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. ప్రొఫైల్ పిక్చర్‌ను సెట్ చేసుకోవడంతోపాటు యూజర్ ఇంటర్‌ఫేస్‌లో సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో యాప్ విడుదల మరో మారు వాయిదా పడింది. యాప్‌ను ఇప్పటికే 50 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. కింభోను మరింత కట్టుదిట్టంగా రూపొందించి త్వరలోనే విడుదల చేస్తామని బాలకృష్ణ తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*