
ఆగస్టు నెల ఈసారి దేశంలో పెను విషాదమే నింపింది. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆగస్టులో పలువురు రాజకీయ, సినీ, క్రీడా, సాహితీ రంగానికి చెందిన ప్రముఖులు మృతి చెందారు. వీళ్లందరూ వివిధ రంగాల్లో తమదైన ముద్రవేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన వారే.
కరుణానిధి: ఈ నెల 7న కన్నుమూసిన కరుణానిధి తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 50 ఏళ్లపాటు డీఎంకే అధినేతగా, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అనారోగ్యంతో 94 ఏళ్ల కన్నుమూశారు. ఆయన మరణంతో తమిళనాడు తల్లడిల్లింది.
అనంత్ బజాజ్: బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎండీ అయిన రెండు నెలలకే, 41 ఏళ్ల అతి చిన్నవయసులోనే ఆయన గుండెపోటుతో ఆగస్టు 10న మృతి చెందారు. 1999లో బజాజ్ ఎలక్ట్రికల్స్‌లో ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనంత్.. బజాజ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ శేఖర్ బజాజ్ కుమారుడు. సొంత కంపెనీలోనే చిన్నస్థాయి నుంచి కెరీర్‌ను ప్రారంభించిన అనంత్ తన ప్రతిభతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎండీ స్థాయికి చేరుకున్నారు. బాధ్యతలు చేపట్టిన రెండు నెలలైనా కాకముందే మృతి చెందారు.
వీఎస్ నైపాల్: ఆగస్టు 12న 85 ఏళ్ల వయసులో వీఎస్ నైపాల్ కన్నుమూశారు. నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత అయిన నైపాల్ భారత సంతతికి చెందినవారు. పూర్తిపేరు విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్. 2001లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని అందుకున్న నైపాల్ ‘ఎ బెండ్ ఇన్ ది రివర్’,‘ ది ఎంజిమా ఆఫ్ ఎరైవల్’, ‘ఫైండింగ్ ది సెంటర్’ వంటి పుస్తకాలు రచించారు.
సోమ్‌నాథ్ ఛటర్జీ: గొప్ప రాజకీయవేత్తగా, పార్లమెంటేరియన్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సోమ్‌నాథ్ చటర్జీ ఆగస్టు 13న తుదిశ్వాస విడిచారు. 10 సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ఆయన స్పీకర్‌గా విశేష సేవలు అందించారు.
అజిత్ వాడేకర్: టీమిండియా వన్డే జట్టు తొలి కెప్టెన్‌గా రికార్డులకెక్కిన అజిత్ వాడేకర్ గొప్ప టెస్టు క్రికెటర్. 77 ఏళ్ల వయసులో ఈ నెల15న మృతి చెందారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారత జట్టు మాజీ కెప్టెన్, చీఫ్ సెలక్టర్‌గా పనిచేసిన ఆయన 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
వాజ్‌పేయి: కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ నెల 16న కన్నుమూశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి ప్రశంసలు అందుకున్న రాజకీయాల్లో ఉన్నత విలువలు పాటించిన నేతగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. దేశానికి ఆయన అందించిన సేవలకు గాను 2015లో దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో ఆయనను సన్మానించింది.
చెన్నుపాటి విద్య: కాంగ్రెస్ నేత, విజయవాడ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన చెన్నుపాటి విద్య ఈనెల 18న విజయవాడలో మృతి చెందారు. ఆమె తండ్రి, ప్రముఖ సంఘసంస్కర్త అయిన గోపరాజు రామచంద్రరావు (గోరా) భావాలను అందిపుచ్చుకున్న విద్య.. మహిళాభ్యుదయానికి, పిల్లల సంక్షేమానికి విశేష కృషి చేశారు.
కుల్దీప్ నయ్యర్: ప్రముఖ జర్నలిస్టు, బ్రిటన్ మాజీ హైకమిషనర్ అయిన కుల్దీప్ నయ్యర్ ఈ నెల 23న 95 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ‘బియాండ్ ద లైన్స్’, ‘ఇండియా ఆఫ్టర్ నెహ్రూ’ తదితర పుస్తకాలు రాశారు. ఆయన చనిపోవడానికి ముందు వరకు తెలుగు దినపత్రిల్లో వ్యాసాలు రాశారు. మహాత్మాగాంధీ హత్య వార్తను దగ్గరుండి కవర్ చేసింది ఆయనే.
నందమూరి హరికృష్ణ: ఎన్టీఆర్ నాలుగో కుమారుడైన నందమూరి హరికృష్ణ అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రవేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన ప్రచార వాహనం చైతన్య రథానికి హరికృష్ణ సారథి అయ్యారు. 1996 నుంచి 99 వరకు ఎమ్మెల్యేగా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 1996లో రవాణా శాఖ మంత్రిగా సేవలందిచారు. 2008లో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర విభజన అంశంపై పార్లమెంటులో తెలుగులో మాట్లాడి దేశం దృష్టిని ఆకర్షించారు. తెలుగు భాషా దినోత్సవం రోజైన ఆగస్టు 29నే ఆయన కన్నుమూయడం గమనార్హం.
అంతేకాదు, ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్, నోబెల్ శాంతి బహుమతి పురస్కార గ్రహీత కోఫి అన్నన్ కూడా ఇదే నెలలో మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ స్విట్జర్లాండ్‌లోని ఓ ఆసుపత్రిలో ఈనెల 18న 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆఫ్రికా ఖండం నుంచి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడుగా అన్నన్ రికార్డులకెక్కారు.
కాగా, కేరళను అతలాకుతలం చేసిన వరదలు కూడా ఈనెలలోనే రావడం గమనార్హం. వరదల్లో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు పది లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
Be the first to comment