
సెప్టెంబరు 2న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న ‘ప్రగతి నివేదన సభ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఓ పక్క ఈ సభకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తుండగా మరో వైపు సభకు అనుమతులు ఇచ్చిన విధానాన్ని ప్రశ్నిస్తూ గద్వాలకు చెందిన న్యాయవాది పూజారి శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజా రవాణా, ప్రజారోగ్యం, పర్యావరణ అసమతౌల్యతలను దృష్టిలో పెట్టుకుని ఈ పిల్ దాఖలు చేశారు.
కేసీఆర్ సర్కారు వందల కోట్ల రూపాయల విలువైన ప్రజాధనాన్ని రాజకీయ ప్రయోజనా కోసం దుబారా చేస్తోందని, నిజమైన ప్రగతి నివేదికలు తెలిపేందుకు ప్రస్తుతం విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం ( లైవ్ స్ట్రీమింగ్, 4G మొదలైనవి) అందుబాటులో ఉందని శ్రీధర్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
ప్రజలు తమ ఆవేదనను, నిరసనను తెలిపేందుకు వేదికైన ధర్నాచౌక్‌ను కేవలం ప్రజా రవాణాకు అడ్డంకి పేరుతో దానిని తరలించిందని, విశ్వవిద్యాలయాల్లో సభలు పెట్టుకుంటామంటే అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోందని, కానీ ‘ప్రగతి నివేదన’ సభకు మాత్రం అనుమతి ఇచ్చారని శ్రీధర్ పేర్కొన్నారు.
సభ కోసం ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి హోర్డింగులు ఏర్పాటు చేశారని, పత్రికలు, ప్రచార మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చారని పేర్కొన్నారు. సభ కోసం ఉద్యోగ ప్రకటనలను సైతం వాయిదా వేసిందని శ్రీధర్ తన పిటిషన్లో ఆరోపించారు. సభ కోసం ప్రభుత్వ రవాణా, రక్షణ, వాణిజ్య, పురపాలక శాఖలకు చెందిన మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించడం వల్ల పాలన గాడి తప్పిందని ఆరోపించారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమిక హక్కులకు భంగం కలగకుండా చూడాలని, రాజ్యాంగంలోని అధికరణాలైన 14,15,21లకు విరుద్ధంగా వ్యవహరించకూడదని ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ తీర్పును అనుసరించి ‘ప్రగతి నివేదన’ సభకు అనుమతులు మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని శ్రీధర్ తన పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. కాగా, హైకోర్టు ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.
– సోమశేఖర్, లీగల్ కరెస్పాండెంట్
Be the first to comment