
నందమూరి హరికృష్ణ ఈ ఉదయం నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. గతంలో ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా అక్కడే జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరో కుమారుడు, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ కూడా అక్కడే ప్రమాదానికి గురి కాగా, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. మూడు ప్రమాదాలు అక్కడే జరగడం ఇప్పుడు చర్చకు కారణమైంది.
నల్లగొండ జిల్లాకు హరికృష్ణ కుటుంబానికి ఏదో సంబంధం ఉందని, ఆయన కుటుంబానికి అది శాపంగా మారిందని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తన ప్రియమిత్రుడు మోహన్ రెడ్డి కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు స్వయంగా కారు నడుపుకుంటూ బయలుదేరిన నందమూరి హరికృష్ణ (61) బయలుదేరారు. హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించాక నల్లగొండ జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు.
ఇదే ప్రదేశంలో గతంలో ఆయన కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రమాదాల బారిన పడ్డారు. వీరిలో ఒకరు మృతి చెందారు. హరికృష్ణ పెద్దకుమారుడు నందమూరి జానకిరామ్ ఇదే ప్రదేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 2009లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ కారుకు కూడా ఇక్కడే ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయట పడ్డారు. మళ్లీ ఇప్పుడు ఇక్కడే హరికృష్ణ కారు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. మూడు కారు ప్రమాదాలు కావడం, అందులో ఇద్దరు మరణించడంపై ఈ ప్రాంతం ఆయన కుటుంబానికి శాపంగా మారిందని అభిమానులు చెప్పుకుంటూ రోదించడం అందరినీ కలచివేస్తోంది.
Be the first to comment