హత్య చేసిన 18 నెలలకు పట్టుబడిన నిందితుడు

వ్యాపారంలో తన భాగస్వామిని హత్య చేసి బెంగళూరు పారిపోయి తలదాచుకున్న నిందితుడిని ఏడాదిన్నర తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 ఏప్రిల్ 2017లో చింతల్‌మెట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మృతదేహం ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, అతడికి సంబంధించిన వివరాలేవీ లభ్యం కాకపోవడంతో అతడెవరో గుర్తించడం కష్టమైంది. రెండు నెలల దర్యాప్తు తర్వాత అతడు తమిళనాడులోని వేలూరుకు చెందిన మహ్మద్‌ ఇంతియాజ్‌(45)గా గుర్తించారు.

తోళ్ల వ్యాపారం చేసే ఇంతియాజ్‌కు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహ్మద్‌నిస్సార్‌(40)తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ కలిసి హైదరాబాద్ వచ్చి తోళ్లు కొనుగోలు చేసి తమిళనాడులో విక్రయించేవారు. వ్యాపారంలో భాగంగా ఇంతియాజ్‌కు నిస్సార్ రూ.15 లక్షలు ఇచ్చాడు. అయితే, వ్యాపారంలో లాభాలు వస్తున్నా ఇంతియాజ్ మాత్రం నిస్సార్‌కు పైసా కూడా ఇవ్వలేదు. డబ్బుల లెక్కల గురించి ఎన్నిసార్లు అడిగినా ఇంతియాజ్ నుంచి సమాధానం రాకపోవడంతో మాట్లాడుకుందాం రమ్మంటూ చింతల్‌మెట్‌లోని తానుండే అద్దె అపార్ట్‌మెంట్‌కు ఇంతియాజ్‌ను తీసుకెళ్లాడు.

అక్కడ డబ్బుల విషయం, లావాదేవీల గురించి చర్చించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేని నిస్సార్ బండరాయితో ఇంతియాజ్ తలపై మోదాడు. అతడు మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత తాళం వేసి వెళ్లిపోయాడు. అయితే, నాలుగు రోజుల తర్వాత దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు కేసును ఛేదించారు. హత్య అనంతరం ముంబైకి పారిపోయిన నిస్సార్ రెండు నెలల క్రితం బెంగళూరు వచ్చాడు. అక్కడే మాటువేసిన పోలీసులు నిస్సార్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*