నేడే తెలంగాణ అసెంబ్లీ రద్దు… గవర్నర్‌ను కలవనున్న కేసీఆర్

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అసెంబ్లీని రద్దు చేయనున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ అనంతరం అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని ప్రకటించనున్న ముఖ్యమంత్రి ఆ వెంటనే గవర్నర్ నరసింహన్‌ను కలిసి కేబినెట్ నిర్ణయాన్ని ఆయనకు తెలియజేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన నేరుగా హెలికాప్టర్‌లో కొంగరకలాన్ చేరుకుంటారు. గవర్నర్‌ను కలిసేందుకు ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు అపాయింట్‌మెంట్ కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఒకవేళ కేసీఆర్ అనుకున్నట్టు కనుక జరిగితే.. అసెంబ్లీని రద్దు చేయకుండానే రద్దు చేసినట్టు అవుతుంది. అదే జరిగితే ఈ ఏడాది మార్చిలో జరిగిన వేసవికాల సమావేశాలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చివరి సమావేశాలు అవుతాయి. అసెంబ్లీని నేడు రద్దు చేయబోతున్నారన్న విషయం తెలిసినప్పటికీ మంత్రులు గుంభనంగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించేంత వరకు ఈ విషయాన్ని ఎక్కడా వెల్లడించకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్టు నేడు సభను రద్దు చేస్తే.. కొంగరకలాన్ సభ తొలి ఎన్నికల ప్రచార సభగా నిలిచిపోతుంది.

ప్రగతి నివేదన సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు, ప్రజలు ప్రత్యేక వాహనాల్లో తరలి వస్తున్నారు. ఈ సభకు 25 లక్షల మందిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. సభలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 20 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం భారీ గాలులతో కూడిన వర్షం పడి భయపెట్టినప్పటికీ నేడు ఎండకాయడంతో సభకు ఆటంకం ఉండదని భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*