
ప్రగతి నివేదన సభ కోసం కొంగరకలాన్ సిద్ధమైంది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎత్తయిన వేదికను నిర్మించి గులాబీ రంగులతో దానిని నింపేశారు. అక్కడి నుంచి ఏవైపు చూసినా కిలోమీటరు దూరం వరకు కనిపించేలా దీనిని తీర్చిదిద్దారు. సభకు హాజరైన అందరూ వీక్షించేలా భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. నేతలు, కార్యకర్తలు, ప్రజల కోసం వేదిక వద్ద సకల సౌకర్యాలు కల్పించారు. నగరమంతా టీఆర్ఎస్ జెండాలు, ముఖ్యమంత్రి కటౌట్లు, బ్యానర్లతో అలంకరించారు.
అన్ని జిల్లాల నుంచి జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు జనసమీకరణను సవాలుగా తీసుకున్నారు. ఇప్పటికే 12 వేల ట్రాక్టర్లలో రైతులు ప్రగతి నివేదన సభకు పయనమయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోయింది. ఎటుచూసినా కిలోమీటర్ల మేర గులాబీ రంగు వాహనాలు దర్శమనిచ్చాయి. వీటిలో చాలా వరకు వాహనాలు నేటి మధ్యాహ్నానికే కొంగరకలాన్ చేరుకోనున్నాయి.
మరోవైపు భాగ్యనగరం నుంచి 15 వేల వాహనాలను ప్రగతి నివేదన సభకు తరలిస్తున్నారు. ఒక్క గోషామహల్ నియోజకవర్గం నుంచే 1500 వాహనాలను సిద్ధం సిద్ధమయ్యాయి. ఇక, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు స్వయంగా ట్రాక్టర్లు నడుపుతూ ర్యాలీలను ప్రారంభించారు. ఆటపాటలు, కోలాటాలు, బతుకమ్మల సందడి సరేసరి. 20 వేల మంది పోలీసులతో భారీభద్రత కల్పించారు. నేటి మధ్యాహ్నం ప్రగతిభవన్లో మంత్రిమండలి సమావేశం ముగిసిన వెంటనే కేసీఆర్, మంత్రులు హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
Be the first to comment