‘మా’ నిధులు స్వాహా.. అసోసియేషన్‌లో భగ్గుమన్న విభేదాలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా)లో మరోమారు విభేదాలు పొడసూపాయి. ‘మా’ నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. విభేదాలు తారస్థాయికి చేరడంతో అధ్యక్ష, కార్యదర్శుల మధ్య వివాదం కాస్తా చినికిచినికి గాలివానగా మారినట్టు తెలుస్తోంది. ఫలితంగా సంఘం కార్యాలయానికి కార్యదర్శి నరేశ్ తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో ‘మా’ అత్యవసరంగా సమావేశమైంది.

నాలుగు గంటలపాటు సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో అధ్యక్షుడు శివాజీరాజా ఇచ్చిన వివరణకు నరేశ్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సభ్యులందరి మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో అందరం కలిసి పనిచేద్దామని ప్రతినబూనారు. అలాగే, నిధులు దుర్వినియోగం అయినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో గతంలోనూ ఓసారి విభేదాలు భగ్గుమన్నాయి. ‘మా’ అధ్యక్ష ఎన్నికల సమయంలో రాజేంద్రప్రసాద్, జయసుధలలో అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలన్న విషయంలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే, ఆ తర్వాత అందరూ కలిసి శివాజీరాజాను అధ్యక్షుడిగా నియమించడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా ఇప్పుడు నిధుల దుర్వినియోగం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*