
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులు పల్లె గ్రామానికి చెందిన నాగ పావని 13 గంటల పాటు కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పుల్లయ్య, నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. గడివేముల మండలం గని గ్రామంలో బంధువుల ఇంటికి వీరు వచ్చి తిరిగి వెళ్తుండగా చిన్నారి తప్పిపోయింది. చిన్నారిని పొలాల వైపు వెళ్తుండగా చూశామని స్థానికులు తెలపడంతో ఎస్ఐ వెంకటేశ్వరరావు తన బృందంతో గాలింపు జరిపారు. వీరికి తోడు వంద మంది గ్రామస్థులు కూడా బృందాలుగా విడిపోయి వెతకడం మొదలు పెట్టారు.
చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో చిన్నారి వన్యమృగాలకు చిక్కిందేమోనని అంతా భయపడ్డారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ వెతుకుతునే ఉన్నారు. చివరకు బృందావనం దారిలో అటవీ ప్రాంతంలో ముళ్ల పొదల్లో చిక్కుకుని చిన్నారి కనిపించింది. ముళ్లపొదల్లో చిక్కుకోవడంతో చిన్నారికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారి దాదాపు 13 గంటలు విషకీటకాల మధ్య చీకట్లో భయంతో గడిపింది. ముళ్లపొదల్లో చిక్కుకుని విలవిలలాడిపోయింది. అయితే ఎట్టకేలకూ చిన్నారిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించిన ఎస్ఐ వెంకటేశ్వరరావు బృందంపై ప్రశంసలు కురుస్తున్నాయి. గ్రామస్థుల సహకారాన్ని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
Be the first to comment