మా డబ్బుతో టీ కూడా తాగలేదన్న శివాజీ రాజా.. గడప కూడా తొక్కబోనన్న శ్రీకాంత్

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డబ్బుతో తాను ఇప్పటివరకు టీ కూడా తాగలేదని, ఫోన్ కూడా సొంతదే వాడుతున్నానని చెప్పారు మా అధ్యక్షుడు శివాజీ రాజా. తాను డబ్బులు తిన్నానని తేలిస్తే తన ఆస్తి మొత్తం మా కు రాసిస్తానన్నారు. ఎన్నికల కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారని, తాము చేసే పనులను తప్పు పట్టడమే వాళ్ల పని అని శివాజీ రాజా ఆరోపించారు.

అటు ఈ వివాదంపై హీరో శ్రీకాంత్ స్పందించారు. అమెరికాలో నిర్వహించిన మా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు వినియోగంపై మూడ్రోజులుగా ఫిల్మ్ ఛాంబర్‌లో పంచాయతీలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఒక్క రూపాయి దుర్వినియోగం అయినట్లు తేలిసినా తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గడప కూడా తొక్కనన్నారు. మూవీ ఆర్టిస్ట్ నుంచి ఇప్పడే వైదొలుగుతానని శ్రీకాంత్ చెప్పారు.

‘మా’ నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. విభేదాలు తారస్థాయికి చేరడంతో అధ్యక్ష, కార్యదర్శుల మధ్య వివాదం కాస్తా చినికిచినికి గాలివానగా మారినట్టు తెలుస్తోంది. ఫలితంగా సంఘం కార్యాలయానికి కార్యదర్శి నరేశ్ తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో ‘మా’ అత్యవసరంగా సమావేశమైంది.

నాలుగు గంటలపాటు సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో అధ్యక్షుడు శివాజీరాజా ఇచ్చిన వివరణకు నరేశ్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సభ్యులందరి మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో అందరం కలిసి పనిచేద్దామని ప్రతినబూనారు. అలాగే, నిధులు దుర్వినియోగం అయినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో గతంలోనూ ఓసారి విభేదాలు భగ్గుమన్నాయి. ‘మా’ అధ్యక్ష ఎన్నికల సమయంలో రాజేంద్రప్రసాద్, జయసుధలలో అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలన్న విషయంలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే, ఆ తర్వాత అందరూ కలిసి శివాజీరాజాను అధ్యక్షుడిగా నియమించడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా ఇప్పుడు నిధుల దుర్వినియోగం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*