ఏపీలోనూ పోటీ చేయమంటున్నారు: కేటీఆర్

ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ పోటీ చేయాలంటూ ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకూ కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమంటూ వినతులు అందుతున్నట్టు చెప్పారు.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మునిసిపల్ భవనం, కళాక్షేత్రం భవనాలకు కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణ పాలమూరు జిల్లా అత్యంత మోసపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు పూర్తయి ఉంటే పాలమూరు జిల్లా నుంచి వలసలు ఉండేవే కావన్నారు. అప్పటి సమైక్య ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఓ సందర్భంలో మాట్లాడుతూ తెలంగాణ వస్తే రాష్ట్రంలో చీకట్లు తప్పవని అన్నారని, కానీ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెల్లలోనే కోతల్లేని కరెంటు అందించామని గుర్తు చేశారు. పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్‌ సరఫరా ఇస్తున్నట్టు చెప్పారు.

వసతి గృహాల విద్యార్థులు తమ ఇంట్లో తింటున్నట్టే సన్నబియ్యం అన్నం తింటున్నారని, అదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ చలువేనని అన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు గతంలో ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల బియ్యం ఇస్తే ఇప్పుడు దానిని ఆరు కిలోలకు పెంచినట్టు కేటీఆర్ చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందిస్తోందన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.

తన ప్రసంగంలో కాంగ్రెస్ నేతలపైనా కేటీఆర్ విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు అడ్డగోలు హామీలు కురిపిస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలో రైతుల గురించి ఒక్కసారి కూడా ఆలోచించని కాంగ్రెస్ ఇప్పుడు వారిపై కపట ప్రేమ కురిపిస్తోందని ఎద్దేవా చేశారు. అర్ధ శతాబ్దంపాటు కాంగ్రెస్ చేసిన పాపాలు కడిగేందుకు నాలుగేళ్ల సమయం సరిపోదన్నారు. ప్రభుత్వం చేసే ప్రతీ పనికి కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆరోపించారు. వచ్చే మూడేళ్లలో షాద్‌నగర్‌ను గుర్తుపట్టలేనంతగా మార్చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*