చెన్నైలో సత్తా చాటిన అళగిరి.. లక్ష మందితో బలప్రదర్శన..

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో దివంగత కరుణానిధి పెద్ద కుమారుడు బల ప్రదర్శనకు దిగారు. తనను డీఎంకేలో తిరిగి చేర్చుకోవాలంటూ లక్ష మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. సోదరుడు స్టాలిన్ నాయకత్వంపై తనకు అభ్యంతరాలు లేవని, స్టాలిన్ నాయకత్వం సమ్మతమేనని అళగిరి చెబుతున్నారు.

వాస్తవానికి కరుణానిధి చనిపోక ముందే అళగిరిని పార్టీకి దూరం పెట్టారు. తన మరో కుమారుడు స్టాలినే తన రాజకీయ వారసుడని డీఎంకే ప్రకటించారు. దీనిపై నాడు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన అళగిరి తండ్రి అనారోగ్యం కారణంగా మౌనంగా ఉండిపోయాడు. కలైంజర్ మరణం తర్వాత పార్టీ స్టాలిన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో అళగిరి మళ్లీ అలిగాడు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాడు.

మధురై కేంద్రంగా రాజకీయాలు కొనసాగించే అళగిరి గ్రామీణ ప్రాంతాల్లో పట్టుంది. అందుకే డీఎంకేకు అళగిరి అవసరం కూడా ఉంది. అయితే స్టాలిన్ నాయకత్వంపై తనకు అభ్యంతరం లేదని చెప్పడం ద్వారా అళగిరి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష మందిని సమీకరించి చెన్నైలో ర్యాలీ నిర్వహించి సత్తా చాటుకోవడంతో పార్టీలో తన ప్రాధాన్యతను ఎవ్వరూ కాదనలేరని అళగిరి చెప్పకనే చెప్పారు. డీఎంకే వర్గాలే నివ్వెరపోయేలా చేశారు. ఎక్కడో చెన్నైకి దూరంగా మధురైలో రాజకీయాలు నడిపే అళగిరి చెన్నైలో సత్తా చాటడంతో స్టాలిన్ సహా డీఎంకే సీనియర్ నేతలంతా షాకైనట్లు తెలుస్తోంది.

అళగిరిని దూరం పెట్టేకన్నా తండ్రి జీవించి ఉన్నప్పుడు అనుసరించే వ్యూహాన్నే స్టాలిన్ కూడా అనుసరించే అవకాశం ఉంది. మధురై ప్రాంతాన్ని గతంలో మాదిరిగా అళగిరికి అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలు కూడా స్టాలిన్‌కు ఇదే సలహా ఇస్తున్నారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*