రాజీనామాతో మరోసారి కలకలం రేపిన రేవంత్.. కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న కేసీఆర్!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్ మధుసూదనాచారికి అందించారు. రేవంత్ రాజీనామా లేఖ తీసుకునేందుకు స్పీకర్ నిరాకరించారు. స్పీకర్ టేబుల్‌పై రిజైన్ లెటర్ ఉంచి పేషీ బయట నుంచుని రేవంత్ నిరసన తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ రద్దవుతుందని ఎవరూ చెప్పలేదన్నారు. ఓ పిచ్చోడు ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో సభ్యుడిగా ఉండటం కంటే రాజీనామా చేయడం మేలన్నారు. అందుకే రాజీనామా చేసి నిరసన తెలుపుతున్నానని చెప్పారు. జోనల్ వ్యవస్థను కేంద్రం ఆమోదించిందని, కేబినెట్‌లో ఉద్యోగాల నోటీఫికేషన్‌పై నిర్ణయం ఎందుకు తీసుకోలేదని రేవంత్ ప్రశ్నించారు. జ్యోతిష్యాల్ని నమ్ముకొని రాష్ట్రాన్ని నడపాలని కేసీఆర్ అనుకుంటున్నారని, ఎవరో శాస్త్రి చెప్పిన మాటలు విని రాష్ట్రాన్ని అడ్డగోలుగా పరిపాలిస్తున్నాడని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పిచ్చి పరాకాష్టకు చేరుకుందని రేవంత్ చెప్పారు. కేసీఆర్ పిచ్చి చేష్టలతో రాష్ట్రం నష్ట పోతుందని, కేసీఆర్ జాతకం బాగాలేకపోతే రాష్ట్ర ప్రజలు ఏంపాపం చేశారని ప్రశ్నించారు. కెసిఆర్ తీరుకు నిరసనగానే రాజీనామా చేశానన్నారు. తాను కాంగ్రెస్‌లో చేరినప్పుడే ..ఎమ్మెల్యే పదవికి, టిడిపికి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడుకు అందించానని రేవంత్ చెప్పారు. ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఎమ్మెల్యేగా జీతభత్యాలతో పాటు గన్ మెన్‌లను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశానన్నారు. రేవంత్ తాజాగా స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా సమర్పించారు.

మరోవైపు ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మంత్రివర్గం అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేయనుంది. ఇప్పటికే ప్రగతి భవన్‌కు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలుస్తారు. అసెంబ్లీ రద్దుపై సాయంత్రానికి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. గవర్నర్‌ను కలిసాక కేసీఆర్ గన్ పార్క్‌కు వెళ్తారు. అమరవీరులకు నివాళులు అర్పించాక తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్‌లో మాట్లాడతారు. రేపు హుస్నాబాద్ సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలుపెడతారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*