అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రచ్చ.. గొడుగులతో వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు.. టీడీపీ కౌంటర్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు బిజేపి సభ్యులు గొడుగులు, రెయిన్ కోట్‌లతో వచ్చారు. సచివాలయం, అసెంబ్లీ అంతా లీకులమయంగా మారిందని, చిన్న వర్షానికే అసెంబ్లీలోకి నీరు వస్తున్నందునే తడవకుండా ఉండేందుకు గొడుగులతో వచ్చామని చెప్పారు. వర్షం పడితే తమ పరిస్థితి ఏంటని, గొడుగులతో వచ్చామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు 10 వేలు ఇచ్చి తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందంటూ బీజేపీ సభ్యులు ఎద్దేవా చేశారు. ప్రజాదనం దుర్వినియోగం చేయడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారని, హడావుడిగా నిర్మాణాలు చేయడంతో నాణ్యత లోపిస్తోందని విమర్శించారు. సచివాలయమా? జలపాతమా? అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు.

శాసనమండలిలో విప్ బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఆటలో బుడంకాయ్‌లాగా బిజేపి వాళ్లు ఐదుగురే ఉన్నారని, అసెంబ్లీకి రాని వైసిపి బిజేపీతో ఆటలు ఆడిస్తోందని ఆరోపించారు. మోదీ-వైసిపి కలయిక బిజేపి వేషాలతో తేలిపోయిందన్నారు. వర్షం పడినప్పుడు అసెంబ్లీలో రెండు చిటుకులు పడి ఉండొచ్చని, మోదీ ప్రజల జేబులకు చిల్లు పెట్టారని వెంకన్న ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏపిలో స్విచ్ వేస్తే దేశంలో లైట్లు వెలుగుతాయన్నారు. బిజేపి పగటి వేషాల వల్ల ఒరిగేది ఏమి లేదన్నారు. హీరో-విలన్‌లకు మద్య కామెడీ యాక్టర్లలా బిజేపి సభ్యులు తయారయ్యారని వెంకన్న ఎద్దేవా చేశారు.

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కేజీహెచ్ ఆసుపత్రిలో సరిపడిన బెడ్లు లేవని, ఒకే బెడ్ మీద ఇద్దరు పడుకునే స్థితి నెలకొందన్నారు. ఒక్క కేజీహెచ్ లోనే 1000 మంది నర్సులు అవసరం ఉన్నా 176 మందిని మాత్రమే నియమించారని చెప్పారు. విశాఖకు చాలా సార్లు ముఖ్యమంత్రి వచ్చి వెళ్తుంటారని, కేజీహెచ్‌ను కూడా సందర్శించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేజీహెచ్ రూపులేఖలు మార్చే శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు.

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు దీనికి కౌంటర్ ఇచ్చారు. గడిచిన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రుల్లో నాన్ ఫంక్షనల్ స్టేజ్‌కి రీచ్ అయ్యాయన్నారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రత కోసం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని తీసుకొచ్చామన్నారు. ప్రాథమిక కేంద్రాల్లోనూ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను పెట్టామని చెప్పారు. అవి చాలా బాగా పనిచేస్తున్నాయని, మెరుగైన సేవలు అందించి.. పేదవారి ఆరోగ్యాన్ని కాపాడాలనేదే ప్రభుత్వ ముఖ్యమైన ఉద్దేశమన్నారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని అంగన్వాడీ, పంచాయతీ భవనాల నిర్మాణాలు చేస్తున్నామన్నారు. విశాఖలో వైద్య, మున్సిపల్ సిబ్బంది కొంత అజాగ్రత్తగా ఉండటం వల్ల డెంగీ వచ్చే పరిస్థితి వచ్చిందని, అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని, నిర్లక్ష్యం వహించిన ఎవరినీ ఉపేక్షించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన వైద్యాన్ని ఇక్కడ అందిస్తున్నామని చెప్పారు.

అంతకు ముంవు అసెంబ్లీ కమీటీ హాలులో స్పీకర్ కోడెల అధ్యక్షతన బిఎసి సమావేశం జరిగింది. మంత్రులు యనమల, కాల్వ, విప్ కూన రవికూమార్, బిజేపి శాసనసబాపక్షనేత విష్ణుకూమార్ రాజు హాజరయ్యారు. బిఏసి సమావేశం ముగిశాక మంత్రి కాల్వ మాట్లాడుతూ ఈ నెల 19 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, 7 పని దినాలు సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 17 అంశాలను ఈ సమావేశాలలో చర్చిస్తామన్నారు. 12 న పోలవరం సందర్శన ఉంటుందని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*