దివాళా దిశగా మరో ” కో ఆపరేటివ్ బ్యాంకు “

కృషి బ్యాంకు, వాసవి బ్యాంకు, చార్మినార్ బ్యాంకు మొదలైన ఆర్థిక అసమానతల వలన మూతబడ్డ బ్యాంకుల జాబితాలోకి మహారాణా ప్రతాప్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సైతం చేరబోతుందా ?మహారాణా ప్రతాప్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు చెందిన ఐదుగురు షేర్ హోల్డర్లు బ్యాంకులో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై వేసిన వాజ్యం నేడు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్ట్ లోని ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.

పిటిషనర్ల తరపు న్యాయవాదులు కిష్టయ్య మరియు సి.హెచ్ ఆంజనేయులు హాజరై వ్యవసాయ మరియు కో ఆపరేషన్ శాఖ వారు ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా విడుదల చేసిన జి.ఓ ఆర్.టి నంబర్ 484 ను నిలుపుదల చేయాలని మరియు సెప్టెంబర్ 09వ తేదీనాడు జరప తలపెట్టిన సర్వ సభ్య సమావేశంలో బ్యాంకు బైలా 22 లో పొందుపరచుకున్న విధంగా కోరం లేకుండా ఎటువంటి నిర్ణయాలను సైతం తీసుకోకూడదని, తదనుగుణంగా బ్యాంకును ఆదేశించామని కోర్టును అభ్యర్ధించటమైనది.

క్షత్రియ రాజపుత్ ట్రస్ట్ బోర్డు క్రింద స్థాపించబడిన ఈ మహారాణా ప్రతాప్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారుల సొమ్ముని పైస్థాయిలో ఉన్న అధికారులు తమ స్వార్ధప్రయోజనాలకై దుర్వినియోగం చేస్తున్నారని కోర్ట్ కు ఆధారాలతో నివేదించారు. జిల్లా కోర్టులలో బ్యాంకు ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు వున్నసంగతిని సైతం కోర్ట్ వారి దృష్టికి తీసుకెళ్లారు.

మొత్తం 3671 మంది షేర్ హోల్డర్లు ఉన్న ఈ బ్యాంకులో సర్వసభ్య సమావేశానికి కనీసం 734 మంది సభ్యుల హాజరు తప్పనిసరి. కానీ గత మూడు సంవత్సరాలలో ఏనాడూ అంత మంది సభ్యులు హాజరు కాలేదు అనే వాస్తవాన్ని గుర్తుచేశారు. బ్యాంకులో జరుగుతున్న ఈ అవకతవకలని, అక్రమాలను గమనించిన ఖాతాదారులు ” మహారాణా ప్రతాప్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు షేర్ హోల్డర్స్ మరియు డిపాసిటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ” గా ఏర్పడి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళారు.

ప్రభుత్వం, తరపున, బ్యాంకు తరపున వాదనలు విన్న న్యాయమూర్తులు రమేష్ రంగనాథన్, కొంగర విజయ లక్ష్మి మొత్తం షేర్ హోల్డర్లలో కనీసం1/5 వంతు సభ్యులతో కూడిన కోరంతోనే ఈవిధమైన నిర్ణయాలైన తీసుకోవాలని బ్యాంకును ఆదేశించారు.

వి.సోమశేఖర్, లీగల్ కరెస్పాండెంట్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*