ప్రేమంటే ఇదే.. జమైకా అమ్మాయిని పెళ్లాడిన కొవ్వూరు అబ్బాయి!

ప్రేమ విశ్వవ్యాప్తం. దానిని ఎల్లలు లేవు, భాష.. సంస్కృతి దానికి అడ్డం కావు. కావాల్సిందల్లా ప్రేమించే గుణం.. దానిని స్వీకరించే గొప్పతనం. ఈ రెండూ ఉన్న కొవ్వూరు అబ్బాయి జమైకా అమ్మాయిని ప్రేమించాడు. అతడి ప్రేమను పెద్ద మనసుతో పెద్దలూ అంగీకరించారు. ఇంకేముంది.. కొవ్వూరులో భాజాభజంత్రీలు మోగాయి. వేదమంత్రాలు మార్మోగాయి. పంచభూతాల సాక్షిగా ఒక్కటైన ఆ జంట ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరుకు చెందిన సురేశ్ చెన్నైలో ఎంసీఏ చదువుకున్నాడు. 2005లో అతడికి జమైకా దేశంలోని ఆండ్రోస్‌ మెమోరియల్‌ ఆసుపత్రిలో సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా ఉద్యోగం వచ్చింది. అదే ఆసుపత్రిలో జమైకాకు చెందిన రొక్సానాస్మిత్‌ యూఎస్ మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు.

అక్కడ పనిచేస్తున్న సమయంలో సరేశ్ ఓ రోజు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో రోక్సానా అతడికి దగ్గరుండి వైద్య సేవలు అందించారు. ఆసుపత్రి చికిత్స ఖర్చులను కూడా భరించారు. అలా వారిమధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. అది మరింత బలపడడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

తన తల్లిదండ్రులు గంగరాజు, రాజ్యలక్ష్మిని రోక్సానాకు పరిచయం చేశాడు. ఆమెకు తండ్రి లేకపోవడంతో ఆమె తల్లి, అక్కతో మాట్లాడాడు. వివాహానికి వారు సరేననడంతో రోక్సానాతో కలిసి ఈనెల 2న సురేశ్ జమైకాలో బయలుదేరి బుధవారం కొవ్వూరు చేరుకున్నాడు. గురువారం తల్లిదండ్రులు, స్నేహితుల సమక్షంలో స్థానిక చర్చిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వివాహం అనంతరం రోక్సానా మాట్లాడుతూ భారతీయ సంస్కృతీసంప్రదాయాలు తననెంతో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*