వరవరరావు కేసు మరో వారం వాయిదా!

విరసం నేత, విప్లవ రచయత వరవర రావు ఆచూకీ నిమిత్తం తన భార్య పి.హేమలత ఆగష్టు 29 2018 నాడు హేబియాస్ కార్పస్ ద్వారా వేసిన వాజ్యం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ముందు విచారణకు వచ్చింది.

 

నిషేదిత మావోయిస్టు గ్రూప్, భీమా కోరేగాం మరియు ప్రధానమంత్రి హత్యకు కుట్ర మొదలైన కేసులతో సంబంధాలు వున్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా అదుపులోకి తీసుకొన్న ఐదుగురిలో వరవర రావు ఒకరు.

 

అక్రమంగా తమ ఇంట్లోకి ప్రవేశించి, అన్యాయంగా, రాజ్యాంగ విరుద్ధంగా తన భర్త వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకొన్నారని, తక్షణమే కోర్ట్ ముందు హాజరు పరచాలని కోర్టువారిని అభ్యర్ధించారు.

ఏదైనా కేసుకి సంబంధించి నిర్భంధించే సమయంలో పాటించవలసిన నియమాలను సుప్రసిద్ధ ” డికే బసు ” కేసులో వివరించారని, ఆ నియమాలను సైతం పాటించలేదని న్యాయస్థానానికి తెలియచేశారు. పిటిషనర్ ఇంట్లో అక్రమంగా సోదాలను జరిపి అర్థం కాని మరాఠా భాషలో మహారాష్ట్ర పోలీసులు ఇచ్చిన ఉత్తర్వులను సైతం పిటిషనర్ తరపు న్యాయవాది డి.సురేష్ కుమార్ కోర్టులో సవాలు చేయటం జరిగింది.

ప్రభుత్వం తరపు ప్రతివాదులుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, చిక్కడపల్లి ఎస్ హెచ్ ఓ ఉండగా, తెలంగాణ ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ హాజరై వాదనలు వినిపిస్తూ ” ట్రాన్సిట్ కాపీ ” ని పిటిషనర్ తరపు న్యాయవాదికి అందచేశామని గుర్తు చేశారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు సి.వి.నాగార్జున రెడ్డి, జి.శ్యామ్ ప్రసాద్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వాజ్యం 6 సెప్టెంబర్ 2018 నాడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు వస్తున్నందున ఈ వ్యాజ్యాన్ని వచ్చే వారానికి వాయిదా వేశారు.

 

వి.సోమశేఖర్, లీగల్ కరెస్పాండెంట్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*