ప్రేమించి మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య.. ప్రియురాలిని వదలొద్దంటూ సుసైడ్ నోట్..

హుజురాబాద్‌: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ గాంధీనగర్‌లో రామగిరి రోహిత్ అనే 19 సంవత్సరాల యువకుడు ప్రేమలో విఫలమై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలు తనను ప్రేమించి మోసం చేసిందని సుసైడ్ నోట్ రాశాడు. ఆ అమ్మాయిని వదలొద్దంటూ స్నేహితులకు రోహిత్ లేఖ కూడా రాశాడు. తమ కుమారుడి ఆత్మహత్యకు కారకురాలైన యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రోహిత్ మృతదేహం‌తో అంబేడ్కర్ చౌరస్తా వద్ద అతడి స్నేహితులు, బంధువులు ధర్నా, రాస్తారోకో చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి నచ్చచెప్పి పంపించారు.

రోహిత్‌ కౌగిలిలో ఆ యువతి అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు మీడియాకు దొరికాయి. ఇద్దరూ ప్రేమలో మునిగి తేలడానికి ఇవే సాక్ష్యాలని రోహిత్ స్నేహితులు చెబుతున్నారు. ఇటీవలే ఆ యువతి రోహిత్‌తో మాట్లాడటం అకస్మాత్తుగా మానేసింది. దీంతో మనస్తాపానికి గురైన రోహిత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

వాస్తవానికి రోహిత్ తండ్రి ఇటీవలే కన్నుమూశారు. దీంతో రోహిత్ తల్లి, తమ్ముడు, అన్న గోదావరిఖనిలో ఉండే బంధువుల ఇంటికి నిద్ర చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో రోహిత్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఎంతకూ తలుపుతీయకపోవడంతో తలుపులు పగలకొట్టారు. అప్పటికే రోహిత్ విగతజీవిగా మారాడు. అతడు రాసిన సుసైడ్ నోట్‌లో తనను ప్రేమించి వంచించిన యువతిని వదలొద్దని స్నేహితులను కోరాడు. యువతితో పాటు ఆమె కుటుంబంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. తల్లిని మంచిగా చూసుకోవాలని తమ్ముడికి రాశాడు.

ఇటీవలే ఇంటిపెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు రోహిత్‌ను కూడా కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*