వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు బెదిరింపులపై చంద్రబాబు సీరియస్!

కృష్ణా జిల్లా గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్‌వీ నరసింహారావుకు ఫోన్ చేసి బెదిరించిన వైసీపీ నేత, మాజీ హోంమంత్రి వసంతనాగేశ్వరరావుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వ్యూహ కమిటీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఈ విషయం ప్రస్తావనకు రాగా, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవసరమైతే మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును అడ్డుతొలగించుకునేందుకు కూడా వెనుకాడబోనంటూ వసంత చేసిన వ్యాఖ్యలపై సీఎం సీరియస్ అయ్యారు. ఇటువంటి చర్యలను ఎవరు ప్రోత్సహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు.

ఈ నెల 7న పంచాయతీ కార్యదర్శి నరసింహారావుకు ఫోన్ చేసిన వసంత నాగేశ్వరరావు ఆయనను హెచ్చరించారు. తనకు కుమారుడు కృష్ణప్రసాద్ చాలా మొండోడని, అసరమైతే మర్డర్లకు కూడా వెనుకాడడని హెచ్చరించారు. ఈ విషయంలో జగన్ కూడా చాలా పట్టుదలగా ఉన్నారని, అవసరమైతే కడప నుంచి మనుషుల్ని కూడా దించాలని అనుకుంటున్నారని బెదిరించారు. టీడీపీ ఏజెంట్‌గా పనిచేయడం మానుకోవాలని హెచ్చరించారు.

 

పంచాయతీ రాజ్ కమిషనర్ తన స్నేహితుడేనని, అతడికి చెప్పి ట్రాన్స్‌ఫర్ చేయిస్తానని బెదిరించారు. టీడీపీ ఏజెంట్‌లా వ్యవహరించడం మానుకోవాలని వసంత నాగేశ్వరరావు హెచ్చరికలు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వసంత హెచ్చరికలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*