
హైదరాబాద్: పాతబస్తీ పురానా హవేలీ, డబీల్పురాలోని నిజాం మ్యూజియంలో జరిగిన దొంగతనం కేసును హైదరాబాద్ పోలీసులు చేధించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ దొంగతనానికి పాల్పడిన దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
దొంగలు అపహరించిన విలువైన వస్తువులను కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు చూపారు. వజ్రాలు తొడిగిన బంగారు టిఫిన్ బాక్స్, బంగారం టీ కప్పు, సాసర్లను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చూపారు. దొంగలు దొంగతనానికి ఉపయోగించిన తాడును, ఇతర పరికరాలను కూడా మీడియా ముందు ఉంచారు. దొంగతనానికి ముందు, తర్వాత దొంగలు హైదరాబాద్ మ్యూజియం వద్ద టూ వీలర్‌పై తిరిగిన చిత్రాలను మీడియాకు చూపించారు. చోరీ కేసును చేధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులను కమిషనర్ అంజనీ కుమార్ అభినందించారు.
సెప్టెంబర్ రెండు ఆదివారం రాత్రి నిజాం మ్యూజియం కిటీకీ ఊచలు తీసి తాడు సాయంతో లోపలికి ప్రవేశించిన దొంగలు దొంగతనం అనంతరం తిరిగి అదే మార్గంలో పారిపోయారు. హాలీవుడ్ సినిమా తరహాలో దొంగతనానికి పాల్పడి హైదరాబాద్ పోలీసులకు సవాలు విసిరారు.
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకూ దొంగలను పట్టుకున్నారు. సీసీటీవీల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా దొంగలు హైదరాబాద్ నుంచి గుల్బర్గాకు పారిపోయారని గుర్తించారు. బృందాలుగా విడిపోయి ఎట్టకేలకూ దొంగలను పట్టుకున్నారు. దొంగలిద్దరూ హైదరాబాద్ పాతబస్తీకి చెందినవారే. దొంగతనానికి ముందు రెక్కీ నిర్వహించారు. దొంగతనానికి ప్లాన్ వేసుకున్నారు. అమలు చేశారు. చివరకు హైదరాబాద్ పోలీసులకు దొరికిపోయారు.
Be the first to comment