59కి పెరిగిన మృతుల సంఖ్య

జగిత్యాల: కొండగట్టు ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 59కి పెరిగింది. జగిత్యాల, కరీంనగర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో అనేక మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు నెంబర్ AP 28Z 2319. జగిత్యాల డిపోకు చెందిన ఈ ఆర్టీసీ బస్సులోకి కొండగట్టు వద్ద ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఎక్కారు. మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అందుకే బస్సులోకి దాదాపు వందమంది ఎక్కారని తెలుస్తోంది. ఘాట్ రోడ్డు దిగుతుండగా బ్రేకులు ఫెయిలై ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్సు కూడా కండీషన్‌లో లేదని సమాచారం. మరొక నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకునే సమయంలో లోయలో పడిపోయింది. చనిపోయిన వారికి కేసీఆర్ రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. ఆర్టీసీ నుంచి మరో రూ. 3 లక్షలు ఇస్తారని తాజా మాజీ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన ఘటనా స్థలానికి బయలుదేరారు. ఇంతమంది చనిపోవడం బాధాకరమన్న ఆయన ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

కొండగట్టు వద్ద బస్సు ప్రమాదంపై గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అటు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*