
టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ టికెట్ విషయంలో సందిగ్ధం వీడింది. గోషామహల్ స్థానాన్ని ఆయనకు కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 13న దానం పేరును అధికారికంగా ప్రకటించనుంది. కేసీఆర్ నివాసంలో జరిగిన సమావేశంలో దానం పేరును ఖరారు చేసినట్టు సమాచారం. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ కొన్ని నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టారు. ముఖ్యంగా కొండా సురేఖ, దానం నాగేందర్ వంటి ముఖ్య నేతల పేర్లు పెట్టడంతో కలకలం రేగింది.
తనకు టికెట్ కేటాయించకపోవడంపై అలిగిన సురేఖ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం కాగా, దానం కూడా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. దీంతో స్పందించిన టీఆర్ఎస్ అధిష్ఠానం నాగేందర్‌కు గోషామహల్ స్థానాన్ని కేటాయించినట్టు సమాచారం.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన దానం కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు వారు దానంతో మాట్లాడారు.
తాను ఉత్తమ్‌ను కలవలేదని, అదంతా కాంగ్రెస్ నేతల దుష్ప్రచారమని దానం ఆ వార్తలను కొట్టిపడేశారు. అయితే, ఈ విషయాన్ని విలేకరుల సమావేశం పెట్టి బహిరంగంగా చెప్పాలని అధిష్ఠానం ఆదేశించడంతో దానం అలాగే చేశారు. దీంతో ఆయనకు గోషామహల్ స్థానాన్ని కేటాయించాలని నిర్ణయించారు. అయితే, తనకు మరో స్థానం కావాలని ఆయన పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. గోషామహల్ నుంచి దానం బరిలోకి దిగనున్నట్టు ఈనెల 13న టీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించనుంది. అలాగే, వరంగల్ తూర్పు, ఖైరతాబాద్ స్థానాలకు కూడా అదే రోజున అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Be the first to comment