బాబ్లీ పోరాట ఫలితం.. రేపో, మాపో చంద్రబాబుకు నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రేపో, మాపో ధర్మాబాద్ కోర్టు నుంచి నోటీసులు అందనున్నాయి. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 2010లో టీడీపీ ఆందోళన చేసింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తే ఉత్తర తెలంగాణ ప్రాంతం ఎడారి అవుతుందంటూ చంద్రబాబు ఆందోళన చేపట్టారు. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్ర వెళ్లి ఆందోళన నిర్వహించారు.

 

సరిహద్దు దాటి మహారాష్ట్రలోకి ప్రవేశించగానే ధర్నా చేస్తున్న చంద్రబాబును ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. లాఠీ చార్జ్ చేశారు. అరెస్ట్ చేసి ఐటీఐలో నిర్బంధించారు. ఆ తర్వాత అక్కడి నుంచి బలవంతంగా విమానం ఎక్కించి అందరినీ హైదరాబాద్ పంపించారు. మహారాష్ట్రలో ప్రవేశించి అరెస్ట్ చేసిన చంద్రబాబు, ఎమ్మెల్యేలపై అప్పట్లో ధర్మాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి నాన్-బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది.

ఇప్పుడీ కేసులో మళ్లీ కదలిక మొదలైంది. పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేయాలంటూ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిని పరిశీలించిన కోర్టు వారెంట్ ఎందుకు అమలు చేయలేదంటూ పోలీసులను ప్రశ్నించింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ కేసులో నోటీసులు జారీ చేయాలని కోర్టు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 

ధర్మాబాద్ కోర్టు నోటీసులు ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. అప్పట్లో తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు పోరాడారని పేర్కొన్నారు. మహారాష్ట్ర పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేయడంతో బెయిలు తీసుకునేందుకు కూడా అప్పట్లో చంద్రబాబు తిరస్కరించినట్టు తెలిపారు. తనను, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినా చంద్రబాబు వెనక్కి తగ్గలేదని, ఆయన తెగువను దేశమంతా చూసిందని పేర్కొన్నారు. కోర్టు కనుక నోటీసులు పంపితే చంద్రబాబు, టీడీపీ నేతలు కోర్టుకు హాజరవుతారని లోకేశ్ పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*