చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. వేడెక్కిన రాజకీయాలు

ముంబై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 15 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు 15మందిపై కేసు నమోదు అయింది.

ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. చంద్రబాబు తిరుమలలో శ్రీవారి సేవలో ఉండగానే నోటీసులు వచ్చినట్లు చంద్రబాబు తెలుసుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి ఏపీ సీయం చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ నోటీసులు ఇవ్వడాన్ని తెలుగు దేశం నేతలు తప్పు బడుతున్నారు.

ధర్మాబాద్ కోర్టు నారా చంద్రబాబు నాయుడు, గంగుల కమలాకర్, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, చింతమనేని ప్రభాకర్, నామా నాగేశ్వరరావు, జి.రామానాయుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, సి.హెచ్.విజయరామణారావు, ముజఫరుద్దీన్ అన్వరుద్దీన్, హన్మంత్ షిండే, పి.అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, ఎస్. సోమోజు, ఏఎస్.రత్నం, పి.సత్యనారాయణ శింభు, టి .ప్రకాష్ గౌడ్, నక్కా ఆనంద బాబుకు నోటీసులు పంపింది.

మరోవైపు చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంపై టీడీపీ మండిపడింది. బీజేపీ చంద్రబాబుపై కక్ష సాధిస్తోందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. కేంద్రం అమలు చేస్తున్న ఆపరేషన్ గరుడలో భాగమేనని ఆయన ఆరోపించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, చంద్రబాబును ముట్టుకుంటే భస్మమైపోతారని హెచ్చరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*