పవన్ కళ్యాణ్ తండ్రిలాంటివారు.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు: బండ్ల గణేశ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం నిర్మాత బండ్ల గణేశ్‌ను విలేకరులు ఇష్టదైవం పవన్ కళ్యాణ్‌‌కు చెందిన జనసేనలో ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా పవన్ కళ్యాణ్ తనకు తండ్రిలాంటివారని చెప్పారు. సినిమా రంగం అంటే తనకు ప్రాణమని, అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరని గణేశ్ చెప్పారు.

తనకు చిన్నప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమని, ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలనేది తన చిరకాల కోరికని  బండ్ల గణేశ్‌ చెప్పారు. జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారా అని అడిగితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమన్నారు.

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తాను బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరానని ఎటువంటి షరతులూ పెట్టలేదని స్పష్టం చేశారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనకు ఆనందంగా, గర్వంగా ఉందని బండ్ల గణేశ్‌ చెప్పారు.

అంతకు ముందు బండ్ల గణేశ్‌తో పాటు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరు నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత వార్ రూమ్‌లో రాహుల్ టీ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణాలో తాజా పరిస్థితులపై చర్చించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా కూడా సమావేశంలో పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*