పరువు హత్యపై మిర్యాలగూడ బంద్.. భర్త చనిపోయాడని గర్భిణి అమృతకు చెప్పని బంధువులు

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు నిరసనగా బంద్ కొనసాగుతోంది. హత్యకు గురైన ప్రణయ్ కుమార్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ నేతలు, కార్యకర్తలు మిర్యాలగూడ బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు ప్రణయ్ హత్య కేసులో అతడి తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు ప్రణయ్ మామ ప్రముఖ వ్యాపారి మారుతీరావు (ప్రణయ్ భార్య అమృత వర్షిణి తండ్రి)ను ఏ-1గా, శ్రావణ్ (అమృత బాబాయ్)ను ఏ-2గా చేరుస్తూ కేసు నమోదు చేశారు.

సూత్రధారులిద్దరూ హత్యకు 45 నిమిషాల ముందే పరారయ్యారు. హత్యకు పాల్పడిన నిందితుడు కుంటుతూ నడుస్తుండటం సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనపడింది. పోలీసులు ఈ కిరాయి హంతకుడెవరో గుర్తించేందుకు యత్నిస్తున్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్యానంతరం దుండగుడు వెళ్లిన మార్గంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ గమనిస్తున్నారు.

అటు దాడిలో భర్త ప్రణయ్ చనిపోయాడనే విషయం భార్య అమృతకు ఇంకా చెప్పలేదు. ఆమె ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. ప్రణయ్‌‌పై కత్తితో దాడి జరగడం చూసి ఆమె షాక్‌కు గురైంది. స్పృహ తప్పి పడిపోయింది. దీంతో వెంటనే ప్రణయ్ సోదరి ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.

మూడు నెలల గర్భిణి అయిన తన భార్య అమృతను నిన్న మిర్యాలగూడ ఆసుపత్రికి తీసుకువచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో దుండగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. తొలి దెబ్బ తలపై, ఆ తర్వాత మెడపై వేశాడు. దీంతో ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఆరు నెలల క్రితం ప్రణయ్, తన కుమార్తె అమృత వర్షిణిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆమె తండ్రి మారుతిరావుకు నచ్చలేదు. నాటి నుంచి కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. అడపాదడపా ప్రణయ్, అమృతను, మారుతీరావు బెదిరించారు కూడా. అయితే ప్రాణాలు తీసేంత కక్ష పెంచుకున్నారని ప్రణయ్, అమృత గుర్తించలేకపోయారు. కుమార్తె తమ పరువు తీసిందని భావించిన మారుతీరావు, ఆయన సోదరుడు కిరాయి హంతకులకు పది లక్షల రూపాయలిచ్చి ప్రణయ్‌ను హత్య చేయించారని పోలీసులు తేల్చారు. ప్రణయ్ మరణాన్ని అతడి కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మిర్యాలగూడలో విషాద వాతావరణం నెలకొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*