బాబుకు వారెంట్‌పై రగిలిపోతోన్న తెలుగు తమ్ముళ్లు.. తెలంగాణాలోనూ నిరసనలు

హైదరాబాద్, అమరావతి: బాబ్లీ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడానికి నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. చేతులకు బేడీలు వేసుకుని నిరసనలు తెలుపుతున్నారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోదీ, జగన్, కేసీఆర్ ఒక్కటై కుట్ర పూరితంగా చంద్రబాబుపై వారెంట్ జారీ చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. తెలంగాణాలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు టీటీడీపీ నేతల ధర్నాచేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరంగల్‌లో ఆందోళన చేస్తున్న టీటీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు.

టీటీడీపీ నేత పెద్దిరెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ నోటీసులు వచ్చిన సమయం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఎనిమిదేళ్లు గడిచిన కేసులో సడన్‌గా అరెస్ట్ వారెంట్‌లు ఏంటని ప్రశ్నించారు. ఆనాడు బాబ్లీ ప్రాజెక్టుపై పోరాటానికి వెళ్లినపుడు టీడీపీ నేతల్ని తీవ్రంగా కొట్టారని, తిరిగి హైదరాబాద్‌లో దిగబెట్టి కేసు ఉండదని చెప్పారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. అప్పుడే లేని కేసు ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ నెల23న ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగం ఇవ్వనున్న తరుణంలో చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. రాజకీయ లబ్ది వస్తుందని కేసీఆర్, మోదీ కలిసి ముందస్తుకు వెళ్తున్నారని, మహాకూటమికి భయపడి మోదీ, కేసీఆర్ కుమ్మక్కయ్యారని పెద్దిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అమెరికా షెడ్యూల్‌ను దెబ్బతీయడానికే ఈ సమయంలో నోటీసులు ఇచ్చారని పెద్దిరెడ్డి చెప్పారు.

అనంతపురంలో మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం పోరాడిన చంద్రబాబుపై కేసులా అని ప్రశ్నించారు. మోదీతో పాటు జగన్, పవన్‌ కల్యాణ్ కుట్రలో భాగమే వారెంట్ జారీ చేశారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు చంద్రబాబు వెంట నడవాల్సిన అవసరం ఉందని, కుట్రను తెలుగు రాష్ట్రాల ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

విజయవాడలో మీడియాతో టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం పోరాడిన చంద్రబాబుకు వారెంట్ జారీ చేస్తారా?అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల తర్వాత నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం సమంజసం కాదన్నారు. తెలుగువారిపై బీజేపీ కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు.

విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ ఆపరేషన్ గరుడలో భాగంగానే చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని ఆరోపించారు. ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం టీడీపీ పోరాడిందని, ఎనిమిదేళ్ల తర్వాత ముందుస్తు నోటీసులు లేకుండా కేసును తెరపైకి తెచ్చారని ఉమ ఆరోపించారు. ఇది కచ్చితంగా రాజకీయ కుట్రలో భాగమేనని, కేసులకు భయపడేది లేదని, న్యాయపరంగా పోరాడతామని, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని చెప్పారు.

చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేయడం కుట్రలో భాగమేనన్నారు. 2010లో రైతులకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు పోరాటం చేశారని, చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించినా వెనక్కి తగ్గలేదన్నారు. చంద్రబాబును ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని, ఒక సీఎంకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం దారుణమని చెప్పారు. మోదీ, జగన్, కేసీఆర్ కలిసి చేసిన దారుణమైన కుట్రగా పుల్లారావు అభివర్ణించారు. ఐరాసలో మాట్లాడే అవకాశం వచ్చిన సీఎంను చూసి ఓర్వలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, సినీ హీరో శివాజి చెప్పిన ఆపరేషన్ గరుడలో ఇది ఒక భాగమన్నారు. దేశానికి ఏపీ రోల్ మోడల్ కావడం చూసి తట్టుకోలేక ప్రధాని మోదీ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని మంత్రి ప్రత్తిపాటి ఆరోపించారు.

శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కళా వెంకట్రావ్ చట్టాలపై చంద్రబాబుకు చాలా గౌరవం ఉందన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కోసం నాడు చంద్రబాబు పోరాడారని, ఎనిమిదేళ్లనాటి బాబ్లీ విషయంలో నోటీసులను చట్ట ప్రకారంగా ఎదుర్కొంటామని చెప్పారు.

విజయవాడలో ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ ఆరు నెలలుగా మోదీ వ్యవహారశైలి సరిగా లేదని, ఏం తప్పు చేశారని చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తారని ప్రశ్నించారు. మోదీని వ్యతిరేకించేవారిపై కక్ష సాధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మోడీ వ్యవహారం హిట్లర్ పాలనలా ఉందని, బీజేపీ నేతలు ఫాసిస్ట్ నేతల్లా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ధైర్యముంటే చంద్రబాబుకు సంకెళ్లు వేయాలని వర్ల హెచ్చరించారు.

రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీజేపీ అరాచకత్వానికి తెరతీసిందన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీ నేతలకు పిచ్చెక్కుతోందన్నారు.

నెల్లూరులో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం దారుణమన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వారెంట్ ఇవ్వడం కక్షసాధింపేనని చెప్పారు. రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకుంటున్నారని, తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇవ్వాలనే చంద్రబాబుకు వారెంట్ జారీ చేశారని చెప్పారు. రేపు నెల్లూరులో భారీ నిరసన కార్యక్రమం చేపడ్తామన్నారు. 24 గంటల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని సోమిరెడ్డి హెచ్చరించారు.

తాఖీదులు ఇవ్వకుండా సీఎంకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ మంచిది కాదని మంత్రి అమర్‌నాథ్ రెడ్డి చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అని నిలదీశారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేంద్రం, టీఆర్ఎస్ చేస్తున్న కుట్ర ఇదని, ప్రజలకు అంతా తెలుసని, ఎన్నికల్లో కుట్ర రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*