
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో నేడు బీజేపీలో చేరారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో ఐవైఆర్ బీజేపీలో చేరారు.
ఐవైఆర్ వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఇటీవలే జగన్ పాదయాత్రలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఐవైఆర్ కూడా పాల్గొన్నారు. వారిద్దరి కెమిస్ట్రీ చూసినవారంతా ఐవైఆర్ వైసీపీలో చేరడం ఖాయమనుకున్నారు. అయితే ఆయన అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ బీజేపీలో చేరారు. ఐవైఆర్ తమ పార్టీలో చేరడంపై ఏపీ కమలనాథులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐవైఆర్లాంటి మేధావులు బీజేపీకి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశాక టీడీపీ అధినేత చంద్రబాబుతో ఐవైఆర్ కృష్ణారావుకు దూరం పెరిగింది. ఐవైఆర్ కృష్ణారావు వైసీపీ దగ్గరౌతున్నట్లే కనపడ్డారు. ఇంతలోనే ఆయన బీజేపీలో చేరారు.
అంతకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మహబూబ్ నగర్ సభలో మాట్లాడారు. మహబూబ్ నగర్ కేంద్రంగా బీజేపీ నేతలంతా ఏకమయ్యామన్నారు. టీఆర్ఎస్ బలవంతంగా ముందస్తు ఎన్నికలను రుద్దిందని, ముందస్తు ద్వారానే టీఆర్ఎస్పై రణభేరి మోగిస్తున్నామన్నారు. మే నెలలో ఎన్నికలు వస్తే ఓడిపోతామని టీఆర్ఎస్ భయపడిందా అని అమిత్ షా ప్రశ్నించారు. లోక్ సభతో కలిసి ఎన్నికలొస్తే ఓడిపోతామని ఆందోళన చెందారా అని ప్రశ్నించారు. మే నెలలో గెలవనివారు.. నవంబర్, డిసెంబర్ లో ఎలా గెలుస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వియోచన దినాన్ని ఎందుకు అధికారికంగా జరపలేదని షా నిలదీశారు. ఓవైసీకి భయపడి సెప్టెంబర్ 17న మౌనంగా ఉంటున్నారా అని షా ప్రశ్నించారు. ఓవైసీకి భయపడే వ్యక్తి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుతారని షా ఎద్దేవా చేశారు. మళ్లీ రజాకార్ల పాలన రావాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. 2014లో గెలిస్తే దళితుడిని సీఎం చేస్తామన్నారు.. చేశారా.. అని షా ప్రశ్నించారు. ఇచ్చిన ఏ మాట మీద కేసీఆర్ నిలబడలేదని షా ఎద్దేవా చేశారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఈ మధ్య పగటి కలలు కంటున్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు. 2014 తర్వాత కాంగ్రెస్ అన్ని చోట్లా ఓడిపోతూ వస్తోందని చెప్పారు. మాజీ ప్రధాని పీవీకి కాంగ్రెస్ చేసిన అవమానాన్ని ప్రజలు క్షమించరన్నారు. దేశంలోకి అక్రమంగా వచ్చిన వారిని వెనక్కి పంపిస్తామన్న షా చొరబాటుదారులు ఎక్కడికి వచ్చినా వెతికి వెతికి వెనక్కి పంపిస్తామన్నారు. తెలంగాణలో దళితులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని షా చెప్పారు.
Be the first to comment