మా నాన్న, బాబాయ్‌లను చంపేసినా పర్వాలేదు: ప్రణయ్ భార్య అమృత

నల్గొండ: మిర్యాలగూడలో దళిత యువకుడు ప్రణయ్ ప్రణయ్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రణయ్ అమృత వర్షిణి తండ్రి, బాబాయ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసులో ఏ-1 నిందితుడు మారుతీరావు కాగా, ఏ-2 నిందితుడు శ్రవణ్‌కుమార్.

అదే సమయంలో హత్యకు పాల్పడిన నిందితుడిని కూడా గోల్కొండ పోలీస్ స్టేషన్ ఏరియాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఒక మహిళ, పురుషుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 20 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. హత్యకు ముందే హైదరాబాద్ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మారుతీరావు కొంత అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు సమాచారం.

మరోవైపు ప్రణయ్ చనిపోయినట్లు మూడు నెలల గర్భిణి అయిన అమృతకు ఆమె బంధువులు చెప్పారు. 2011 నుంచి తనకు ప్రణయ్ పరిచయం అని, నాటి నుంచీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని అమృత మీడియాతో చెప్పారు. తనను చాలాసార్లు ఆమె బాబాయి కొట్టాడని అమృత చెప్పారు. 2018, జనవరి 13న ఆర్య సమాజ్‌లో తమ వివాహం జరిగిందని తెలిపారు. డీఎస్పీ దగ్గర తమకు కౌన్సిలింగ్ నిర్వహించారని అమృత చెప్పారు. అయినా కూడా తాను ఒప్పుకోలేదన్నారు. ప్రణయ్ మీద ప్రేమతో ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.

కొద్ది రోజులు హైదరాబాద్‌లో ఉన్నాక తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ప్రణయ్ వాళ్ల అమ్మ సహకారం అవసరం కాబట్టి మిర్యాలగూడలోనే ఉంటున్నట్లు అమృత తెలిపారు. తన పెళ్లి తన పెద్ద వాళ్లకు ఇష్టంలేదని, తన నాన్న, బాబాయ్‌లే ప్రణయ్‌ను హత్య చేయించారని ఆమె ఆరోపించారు. ప్రణయ్ గుర్తుగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ఉంచుకుంటానని అమృత చెప్పారు. తన తండ్రి, బాబాయ్‌లను చంపేసినా పర్వాలేదని అమృత చెప్పారు.

మరోవైపు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు నిరసనగా బంద్ కొనసాగుతోంది. హత్యకు గురైన ప్రణయ్ కుమార్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ నేతలు, కార్యకర్తలు మిర్యాలగూడ బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు ప్రణయ్ హత్య కేసులో అతడి తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు ప్రణయ్ మామ ప్రముఖ వ్యాపారి మారుతీరావు (ప్రణయ్ భార్య అమృత వర్షిణి తండ్రి)ను ఏ-1గా, శ్రావణ్ (అమృత బాబాయ్)ను ఏ-2గా చేరుస్తూ కేసు నమోదు చేశారు.

సూత్రధారులిద్దరూ హత్యకు 45 నిమిషాల ముందే పరారయ్యారు. హత్యకు పాల్పడిన నిందితుడు కుంటుతూ నడుస్తుండటం సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనపడింది. పోలీసులు ఈ కిరాయి హంతకుడెవరో గుర్తించేందుకు యత్నిస్తున్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్యానంతరం దుండగుడు వెళ్లిన మార్గంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ గమనిస్తున్నారు.

అటు దాడిలో భర్త ప్రణయ్ చనిపోయాడనే విషయం భార్య అమృతకు తొలుత చెప్పలేదు. ఆమె ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. ప్రణయ్‌‌పై కత్తితో దాడి జరగడం చూసి ఆమె షాక్‌కు గురైంది. స్పృహ తప్పి పడిపోయింది. దీంతో వెంటనే ప్రణయ్ సోదరి ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కొద్ది సేపటి క్రితం ప్రణయ్ హత్యకు గురయ్యాడని అమృతకు చెప్పారు. గుండెలు పగిలేలా రోదించిన అమృత తన భర్తను చంపించిన తండ్రి, బాబాయ్‌లను చంపేసినా పర్లేదని చెప్పారు.

మూడు నెలల గర్భిణి అయిన తన భార్య అమృతను నిన్న మిర్యాలగూడ ఆసుపత్రికి తీసుకువచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో దుండగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. తొలి దెబ్బ తలపై, ఆ తర్వాత మెడపై వేశాడు. దీంతో ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఆరు నెలల క్రితం ప్రణయ్, తన కుమార్తె అమృత వర్షిణిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆమె తండ్రి మారుతిరావుకు నచ్చలేదు. నాటి నుంచి కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. అడపాదడపా ప్రణయ్, అమృతను, మారుతీరావు బెదిరించారు కూడా. అయితే ప్రాణాలు తీసేంత కక్ష పెంచుకున్నారని ప్రణయ్, అమృత గుర్తించలేకపోయారు. కుమార్తె తమ పరువు తీసిందని భావించిన మారుతీరావు, ఆయన సోదరుడు కిరాయి హంతకులకు పది లక్షల రూపాయలిచ్చి ప్రణయ్‌ను హత్య చేయించారని పోలీసులు తేల్చారు. ప్రణయ్ మరణాన్ని అతడి కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మిర్యాలగూడలో విషాద వాతావరణం నెలకొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*