తెలంగాణ విమోచన దినం – అధికారిక నిర్వహణ ఇంకెప్పుడు?

  • 17 సెప్టెంబర్ 1948.. ఈ రోజు విలీనమా, విమోచనమా, విముక్తా?.. ఏది నిజం?..
  • తెలంగాణ సమాజంలో 66 ఏళ్లుగా సమస్యగా మిలిపోయిన అంశం ఇది..

ప్రతి మనిషి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోరుకుంటాడు.. అందుకే స్వాతంత్ర్యం నా జన్మహక్కు అని గర్జించారు బాలగంగాధర్ తిలక్.. 15 ఆగస్టు 1947 న బ్రిటిష్ పాలన అంతం కావడంతో భారత దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని ఏటా ఆ తేదిన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది.. మరి తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసుకున్నారు? తమదైన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవడం లేదు?..
17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ సంస్థానం (తెలంగాణ అందులో ఒక భాగం)లో అసఫ్ జాహీ వంశస్తుడైన ఏడో నిజాం మీర్ ఉస్మా అలీఖాన్ నిరంకుశ పాలన అంతమైంది. ఇది అంత సులభంగా జరగలేదు. బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తర్వాత అప్పటి వరకూ వారికి సామంతుడిగా ఉన్న నిజాం తన రాజ్యాన్ని భారత్ లో కలిపేందుకు ఇష్టపడలేదు.. ఈ సంస్థానంలో పగలంతా పోలీసులు ప్రజలను పీడితే, రాత్రి వేళ రజాకార్లు ప్రజల మాన ప్రాణాలను దోచుకునేవారు.. స్వేచ్ఛ స్వాతంత్ర్యం, ప్రజల హక్కుల కోసం పోరాడిన ఆర్యసమాజ్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులను చిత్రహింసలకు గురి చేసి బంధించారు.

సంస్థానంలో రోజు రోజుకీ దిగజారుతున్నపరిస్థితులను గమనించిన నాటి భారత హోంమంత్రి సర్ధార్ వల్లభాయి ఆపరేషన్ పోలో (పోలీస్ యాక్షన్) చేపట్టారు.. ఐదు రోజుల యుద్దం తర్వాత నిజాం నవాబు లొంగుబాటు ప్రకటించారు.. ఇదీ సంక్షిప్త చరిత్ర.

17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో సంపూర్ణంగా కలిసిపోయింది. తర్వాత కాలంలో ఈ సంస్థానం కాలగర్భంలో కలిసిపోయి మూడు ముక్కలైంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కలిసిన పాత హైదరాబాద్ జిల్లాల్లో ప్రతి ఏటా అక్కడి ప్రభుత్వాలు ఈ తేదీన అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి.. కానీ ఆంద్రప్రదేశ్ లో విలీనమైన తెలంగాణలో మాత్రం ఎలాంటి వేడుకలు జరగలేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ పక్షాన ఈ వేడకలు నిర్వహిస్తామని అప్పట్లో తెరాస అధినేత కేసీఆర్ ప్రకటించారు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ విషయాన్నే మరచిపోయినట్లు నటిస్తున్నారు..

గత సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైనా, నేటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అయినా 17 సెప్టెంబర్ వేడుకలు నిర్వహించక పోవడానికి కారణం ముస్లింలు నొచ్చుకుంటారనే భయమేనట.. మరి 15 ఆగస్టు జరుపుకుంటే క్రైస్తవులు బాధ పడుతున్నారా?.. ఇందుకీ అర్థం లేని వాదన.. మరి కొందరు అతి మేధావుల వాదన ఈ తేదీ విద్రోహ దినమట.. ఇంకొందరు ఈ తేదీ విలీనమా? విమోచనమా? విముక్తా? అనే వాదనలతో గందరగోళం సృష్టిస్తున్నారు.. ఈ అర్థంలేని వాదనలతో తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినమైన సెప్టెంబర్ 17కు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు..

ఎవరకు ఏమనుకున్నా, నొచ్చుకున్నా మనకు అనవసరం.. 15 ఆగస్టుకు ఉన్న ప్రాధాన్యతే 17 సెప్టెంబర్ కు ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులను తలచుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంకన్నా ముందే ఉన్న హైదరాబాద్ సంస్థాన స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోవడంలో ఇబ్బంది, తప్పు ఏముంది? ఈ రోజున సగర్వంగా తిరంగా ఎగరేద్దాం.. తెలంగాణ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుందాం..

– క్రాంతి దేవ్ మిత్ర, , జర్నలిస్ట్, హైదరాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*