
యాదగిరిగుట్ట: కొండగట్టు బస్సు ప్రమాద ఘటన జరిగిన వారం రోజుల్లోనే మళ్లీ వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నేడు నాగర్ కర్నూల్ జిల్లా బిజ్నాపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు పోదల్లోకి దూసుకెళ్లి మట్టిలో దిగబడిపోయింది. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసి బస్సు సుమారు 100 మంది ప్రయాణికులతో నాగర్ కర్నూల్ వైపు వస్తుండగా ముందు చక్రాలు విరిగి చెట్ల పోదల్లోకి దూసుకెళ్లింది. దాంతో కుదుపులకు గురై 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది మందిని హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు.
ఇటీవలే గజ్వెల్ మండలం రిమ్మనగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు చనిపోయారు. 18మందికి తీవ్రగాయాలయ్యాయి.
అంతకు ముందు కొండగట్టు లోయలో పడిన ఘటనలో 60 మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులు ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇవాళ్టి ఘటనపై మహేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆర్టీసీ నిర్లక్ష్యంపై కన్నెర్ర చేశారు. వేగం వీడాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని ఆదేశించారు.
అయితే వరుస ప్రమాదాల నేపథ్యంలో తెలంగాణలో జనం బెంబేలెత్తుతున్నారు. తగిన భద్రతా చర్యలు పాటించాలని, ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నారు.
Be the first to comment